పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మీఁగడ తఱకలు

45


బూజ్యలగుచు, జనులు తమయెడ ననురాగంబు సేయ మెలఁగుచున్నవారు. ధర్మపౌరుష ప్రభావంబుల వార లధికులై యున్నయెడ వారల నెట్లు నగరంబు వెలువరింపించి వారణావతంబునకుం బనుపువాఁడ, నట్లు పనిచినను లోకంబునం గలజనులు నిందింపకుందురె?"

(ఆదిపర్వము-నూటముప్పది తొమ్మిదవ యధ్యాయము.)

ఈ వచనము సంస్కృతభారతమునఁ గల్గు విషయములన్నియును గల్గి, యాంధ్రభారతముకంటె మిక్కిలి విపులముగా నున్నది. ఈచదువcబడిన భాగము నన్నయార్యుని రచనమున నత్యల్పమగునట్లు సంకుచింపఁబడినది. విస్తరభీతిచే దానినిగూడ నిం దుదాహరింప మానితిని. సంస్కృత భారతప్రకార మధ్యాయవిభాగముతో నీయూదిపర్వము మూఁడాశ్వాసములుగా విభజింపఁబడినది. ఆశ్వాసాద్యంతములందుఁ బద్యములు కలవు.

ఈ గ్రంథమునందుఁ గొంత ప్రాచీనప్రయోగసరళి కన్పట్టుచున్నది. (1) అమ్మహాసంగ్రామంబునకుం గూడిన పదునెనిమిది యక్షౌహిణుల రాజులును కాలవశంబునం జని రందులకు సుయోధనుండు హేతువై నిల్చుటంజేసి యజ్ఞానంబునం దన కేమియుఁ దోఁచదయ్యె నెంత తెలిసెద నన్నం దెలివి సెందఁజాలక యున్నవాడ. (2) సూతనందనా! యింతకార్యంబు నడచిన పిమ్మటఁ దాను బ్రతికియుండుటకు ఫలంబు లేశంబునుం గాన (ధృతరాష్ట్రునిపల్కులు) (3) ఓ డుండుభంబ! తొల్లి యొక దుష్టభుజంగంబు తనకుఁ బ్రాణపదం బయినప్రమద్వరకుఁ గీ డాచరించె (రురునిపల్కు)

ఇట్టి వాక్యములందు ‘నేను' శబ్దము ప్రయోగింపఁబడు. పట్టులందుఁ 'దాను' శబ్దము ప్రయోగింపఁబడినది. పూర్వకవుల రచనలం దిట్టి ప్రయోగములు కలవు.

(1) ఈ ప్రబంధముం-దన కిపు డంకితంబుఁ బ్రమదంబునఁ జేయుము.

(ప్రౌఢకవిమల్లన)