పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

38

మీఁగడ తఱకలు


కలదు. నన్నయాదులు వచనకావ్యరచన మీకారణముచేతనే మాని రన్నచో దృశ్యకావ్యములు రచింపమికి వేఱొకకారణము వెదకవలసియుండును. వారు వీనిని రచింపమికిఁ గారణ మిదియని నిరూపింపవలనుపడదు.

పదపడి యిటీవల పదునాఱవశతాబ్దితుదనుండియు వచన కావ్యములును యక్షగానము లనునొకవిధ మగురూపకవికారములును రచింపఁబడుచు వచ్చినవి. యక్షగానము లంతకుcబూర్వము సయిత ముండిన నుండియుండును గాని వచనకావ్యములు లే వనవచ్చును. ఆంధ్రభోజఁ డనఁబడు కృష్ణదేవరాయల నాఁటనుండియుఁ జోళపాండ్యాది రాజ్యములందుఁ దెలుఁగు రాజభాషగా వ్యవహరింపఁబడుచువచ్చెను. ఆరాజ్యములను విజయనగరరాజసంబంధులు పరిపాలించుచువచ్చిరి. పదునాఱవశతాబ్దినుండి యాంధ్రదేశమున రచింపcబడిన వానికంటె నక్కడ రచింపబడిన తెనుఁగుఁగబ్బములు మెండు. మఱియు నవి రసోత్తరములు అయి యున్నవి. విజయవిలాసాదిప్రబంధము లయ్యెడ నప్పు డుప్పతిల్లినవే. నాఁ డక్కడ రచింపఁబడిన కబ్బము లింకను మనకుఁ గొన్ని చేకుఱలేదు. మన యాంధ్రభాషావధూటి శుద్ధద్రావిడదేశమున సయితముఁ దన నుడికారపుఁ బొంకమున సంపూర్ణాదరము వడిసి పోషింపఁబడినదిగదా! తొలుదొలుత యాంధ్రవచన కావ్యరచన దక్షిణ దేశముననే యారంభింపఁ బడినది. దక్షిణదేశమందు రచింపఁబడిన యీ వచనకావ్యములఁగూర్చి ప్రశంసింపఁ బోవునప్పుడు ముందు నన్నయభట్టారకాదులు తమగ్రంథములఁ దందందుఁ బొందుపఱుచుచు వచ్చిన వచనములఁగూర్చియుఁ గొంతచర్చించుట యావశ్యకము కాకపోదు. నన్నయభట్టారకునికవనమునం దెడనెడఁ గల్గుగద్యములు మన యచ్చుకూర్పునఁ బదిపదునైదు బంతులకంటె హెచ్చుగాక ముచ్చట లిచ్చుచుండును. తొంటికవుల రచనలలో నన్నయభట్టారకుని గద్యములే