పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/56

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

5

ప్రాచీనాంధ్రవచనకావ్యములు

“దేశభాషలందుఁ దెలుఁగు లెస్స" నాఁ బరఁగిన మన యాంధ్రభాషయందు నన్నయభట్టారకుఁ డాదిగాఁ గల తొల్లింటికవు లెల్లరును జంపూప్రబంధములను, మిక్కిలి తక్కువగా నిర్వచన పద్యకావ్యములను మాత్రమే రచించిన ట్లెఱుకపడుచున్నది గాని శుద్ధవచనకావ్యములను, మఱియు దృశ్యకావ్యములను రచించినట్టు కన్పట్టదు. ఆద్యప్రకృతి యగుగీర్వాణభాషయందు, సుబంధుని వాసవదత్తయు, బాణునికాదంబరీ హర్షచరిత్రములును, దండి దశకుమారచరిత్రమును మొదలుగాఁ గొన్ని ప్రౌఢతమము లగుగద్యకావ్యములు గలవు. కాళిదాస భవభూతి ప్రముఖుల రసోత్తరము లగుదృశ్యకావ్యములును గలవు. మన యాంధ్రవాఙ్మయము సంస్కృతవాఙ్మయమునుబట్టి పుట్టి పెరుగుటయుఁ, దొలుదొలుతఁ బ్రాయికముగా నాంధ్రకావ్యకర్తలు సంస్కృతగ్రంథములనే యనువదించుచు వచ్చుటయు, విస్పష్టమ కదా. పురాణాదులతోఁ బాటు మున్నే కొన్ని గద్య కావ్యములును, దృశ్యకావ్యములును, సంస్కృతము నుండి మనవారిచేఁ దెనుఁగున ననువదింపcబడెనుగాని యా యనువాదములును జంపూరూపములే యయ్యెను. వచనకవిత్వ మొక కవిత్వ మనిపించుకొన దని తలఁచి, నన్నయ భట్టారకాదులు రచింపమానిరని కొంద ఱనియెదరుగాని యది సమంజసమయినట్టు కన్పట్టదు. సంస్కృతమున వాసవదత్తాకాదంబర్యాదులకున్న గౌరవ మసామాన్యమైనది గదా! కవిత్వమునకు ఛందఃపరిశ్రమమే ముఖ్యమనుట కెవ్వ రంగీకరించెదరు? పద్యకవిత్వముకంటె గద్యకవిత్వమే కవియొక్క సంపూర్ణశక్తి నపేక్షించునని సంస్కృతభాషయందు "గద్యం కవీనాం నికషం వదంతి" యనునానుడి