పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మీఁగడ తఱకలు

23


వెలనాటిచోడని వివాదసభలో నిలిపిరఁట. మల్లికార్జునపండితారాధ్యునితో వాదములందు శివనింద చేసినదోషమును, దీపార్చనాసాధనమునుహరించిన దోషమును సైపఁజాలక పండితారాధ్యులశిష్యులాబౌద్ధాచార్యులను జంపిరి. ఆబౌద్ధాచార్యులు ప్రతిదినము సముద్రమధ్య ద్వీపమునఁగల బుద్దప్రతిమను బూజింప నరుగుచుండువారఁట! ధనదుపురమునకు సమీపమునఁగల సముద్రద్వీపము నేఁటి దీవిఖండము. అక్కడ బౌద్ధస్తూప ముండెడిది గాఁబోలును. కాదేని ధనదుపురమునకుఁ జేరువనేకల బుద్దాము మొదలగు గ్రామములు గావచ్చును. కాని యవి సముద్ర ద్వీపస్థములుగావు. బౌద్ధాచార్యు లాసముద్ర ద్వీపమునకు బుద్ధపూజ జరపనేఁగినపుడే పండితారాధ్యుల శిష్యులు వారిని జంపిరి. అట్లు వారిని జంపుటకుఁ బండితారాధ్యుఁ డాశిష్యుల కనుజ్ఞ యిచ్చెనఁట. శివదూషకులను జంపుట పాపముగా దని పండితారాధ్యుఁడు శివయోగ సారమునఁ జెప్పినాఁడు.

క|| శివనిందావిషయం బగు
     నవమానము సెప్పునట్టి యప్పుస్తకముల్
     అవిచారంబునఁ గాల్పఁగ
     నవుఁ జెప్పెడివానిఁ జంపనగు నీశానా!

క|| శివనిందారతుఁ జంపిన
     జవమఱి తత్కారణమునఁ జచ్చిన నీరెం
     డువిధంబుల నీకారు
     ణ్యవశంబున ముక్తిఁ బొందు నరుఁ డీశానా!