పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

18

మీఁగడ తఱకలు

దీపితప్రాస యతిచ్ఛద సరణి
నామహాగురుదేవు ననుమతియట్లు
శ్రీ మెఱయంగ రచించితి నిట్లు
                                 - మఱి బసవపురాణము.

ఇతరకవులు గర్హించినను దర్వాతి శివకవులు సోమనాథాదుల మార్గమును వెన్నాడిరి. ఇప్పటికి రెండువందల యేండ్లకు ముందున్న కవులు, అత్తలూరి పాపకవి మొదలగు వారుకూడ నాసంప్రదాయమునే పాటించిరి. పాల్కురికి సోమనాథుని గ్రంథములలో నితరకవులకు విరుద్ధములయిన ప్రయోగము లేవికలవో యవి పాపకవి మొదలగువారి గ్రంథములలోఁ గూడ నున్నవి. మఱియుఁ బాల్కురికి సోమనాథుఁడు చూపిన త్రోవయగుటచేఁ గాఁబోలును శివకవు లనేకులు ద్విపదకృతులను రచియించిరి.

వీరు తెనుఁగనే ప్రేమించిరి

ద్రవిడదేశమున శైవులును, వైష్ణవులును సంస్కృతభాషకంటెఁ దమ తమిళభాషనే పూజ్యమయిన మతభాషగాc జేసికొన్నట్టుగా నీ తెనుఁగుదేశమునఁగూడ వీరశైవులు తెలుఁగుభాషనే మతభాషగాఁ జేసికొనఁ దలంచిరి. మల్లికార్జున పండితారాధ్యుఁడు శాస్త్రార్ధములతోఁ గూడిన మతగ్రంథమును శివతత్త్వ సారమును దెనుఁగుననే రచియించెను.పాల్కురికి సోమనాథుఁడుకూడc దాను గ్రొత్తగా వెలయించిన బసవపురాణము, పండితారాధ్యచరిత్రము, చతుర్వేదసారము మొదలగు గ్రంథములను దెనుఁగుననే రచియించెను. వీరు సంస్కృతమునఁగూడ గొప్పవిద్వాంసులే! బసవపురాణమును, బండితారాధ్యచరిత్రమును సోమనాథుఁడు