పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/23

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ఇది మూఁడవ ప్రమాదము. ధనకటకమున ననేక సహస్రసంఖ్యాకు లగుబౌద్ధభిక్షకు లుండి రని హ్యూన్త్సాంగు వ్రాఁతలు తెలుపుచున్నవి. అంత ప్రసిద్ధమయిన మన ధనకటమునుగూర్చికూడ సందేహించుటకుఁ గారణము వా రంధ్రదేశమును బాలించి రన్నవిషయమును గుర్తింపక పోవుటే యగును.

బళ్లారిజిల్లా మాయక్టోనిలోను, హిరహడగళ్లిలోను దొరకిన పల్లవ (శివస్కందవర్మ) శాసనములలో సాతవాహనిహార మని సాతాహనిరట్ట' మని (సాతవాహనహారము, సాతవాహనరాష్ట్రము) పేళ్లున్నవి. ఆపేళ్లా శాసనములు దొరికిన స్థలమునకుఁజెందినవేయని యందఱు నంగీకరింతురు అందొక గ్రామము పేరు 'చిల్లరేక కోడుంక, నేఁడు తెల్లుదేశమున 'చిల్లరిగె యింటిపేరు గల బ్రాహ్మణు లున్నారు. వారు మాధ్వులు. బళ్లారిజిల్లాలో చిల్లరిగెయను గ్రామము గలదేమో! పయి శాసనములోని చిల్లరేక చిల్లరిగె కావచ్చు నని నా తలంపు. బళ్లారిమండలము సాతవాహన రాష్ట్రమయి యుండంగా సాతవాహను లంధ్రు లగుట సంగతమేకాదా? కాని యీ శాసనములు క్రీ. తర్వాత మూCడవశతాబ్దిలోనివిగాన, అప్పటికి సాతవాహను లాయల్పదేశముఁ బాలించుచున్నట్లు తలఁపవలె నందురట! ఇది యెంతయు నసంగతము. శివస్కందవర్మ దానముచేయునప్ప డాదేశము శివస్కందవర్మపాలితమే యగునుగాని సాతవాహనపాలితము గాదు. శివస్కందవర్మ యూదేశమునకుఁ బారంపర్యముగా వాడుకలో నున్న పేరిని (సాతవాహన రాష్టమని) పేర్కొన్నాండు గాని యానామ మానాఁడే పుట్టినదికాదు. ఆనాఁటి కనేకదేశములు సాతవాహనరాజ పాలితములుగా నుండినను సాతవాహనరాష్ట్రమని విశిష్టనామ ముండుట, బళ్లారి ప్రాంత దేశమున కా సాతవాహనుల ప్రాచీన ప్రధానపాలితదేశత్వమును