పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/22

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

మీఁగడ తఱకలు

3


ములకనాటికి శ్రీగిరి నడిబొడ్డు. రాజ్యములు, రాజధానులు మాఱుటలో ఈ నాళ్ల ప్రాముఖ్యమును, బరిమాణమును మాఱినవి. ఈ విషయమును బ్రబలముగా నిరూపించుట కిక్కడ చోటు చాలదు. పల్నాడు శ్రీనాథునినాఁడు గూడ ములికినా డనువ్యవహారము నందుచుండెననుట కాధారముగలదు. క్రీడాభిరామమందలి యీ క్రింది పద్యముఁ జదువందగును.

ఉ|| చిత్తముగూర్చి మాచెరలచెన్నుఁడు శ్రీగిరిలింగముం గృపా
     యత్తతఁ జూడ ముల్కివిషయంబున కా మహిమంబు చెల్లెఁ గా
     కుత్తరలోన మింట జల ముట్టిన మాత్రన నాపఱాలలో
     విత్తిన యావనాళ మభివృద్ధి ఫలించుట యెట్లు చెప్పుఁడా!

ముళక దేశము సాతవాహనుల యేల్బడిలో నుండుటచేతనే వారు శ్రీస్థాన' మునకును బతులయిరి. శ్రీస్థాన మనంగా శ్రీశైలమే. పర్వతములపేళ్ల వరుసలో నున్నది గాన యది శ్రీశైలమేయగును. అయినను గొందఱు సందేహించుచున్నారంట! ఏకప్రమాద మనేకప్రమాదములకుఁ గారణ మగుట నిక్కడం జూడఁదగును. ముళక దేశమును గుర్తింపక పోవుటచేతనే వారు శ్రీస్థాన మనంగా శ్రీశైలమగు నని నిశ్చయింపఁ జాలక సందేహింపవలసినవారయిరి. అగును. ప్రత్యంతదేశమున కేలికలు గాక యాపర్వతమునకుమాత్రము వా రెట్లు పతులు గాంగల్లుదురు? పర్వతముమీఁది కాకాశయానమున రాకపోకలు జరపుచు ప్రభుత్వమును నెఱపుకొనుచుండినట్లు తలఁపవలెనా? ఈ యసంగతియే శ్రీస్థానము శ్రీశైలము గాకపోవచ్చు ననునపోహమును బుట్టించినది. మటియు నాసికగుహలోనే కల వాసిష్ఠీపుత్ర పులుమావి శాసనాంతరమున ధనకట' భిక్షులకు దానము చేసినట్టు కలదు. ఈ ధనకటమును ధనకటక (ధరణికోట) మని తలంచుటకుఁ గూడఁగొందఱు సందేహించిరంట!