పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



14

ఆoధ్రభాషావతారము

అమ్మ-అబ్బ-శబ్దరూపనిష్పత్తి

సాధారణముగా వాడుకలో నుండుదేశభాషలలో మాతాపితరులు, అగ్రజులు, పితృవ్యమాతృవ్యులు, పితృమాతృష్వసలు, పితామహమాతామహులు పసిబిడ్డ లుగ్గుపాలనాఁటి బోసినోటితో తమ్ముఁ దా మెఱుఁగ నేరనినాఁటికే, పరిచితులై పలుకరించువారు, పలుకరింపఁబడువారు నగుదురు గాన వారిచుట్టఱికపుఁబిలుపు పదములు నిర్ధంతముగ్ధాస్యములతో నుచ్చరింపఁబడునవై యుండును.

నోరు తెఱచునపుడు వచ్చుధ్వని - అ.

నోరు మూసి తెఱచునపుడు వచ్చుధ్వని -మ్మ

నిసుఁగులు నోరు మూయుచుఁ దెఱచుచు ధ్వని సేయుచుండుటలో అమ్మ-శబ్ద మేర్పడును. అది మాతృవాచక మయ్యెను - అట్లే కొంచపుమార్పులతో అ-బ్బ, అ-ప్ప, అ-న్న అ–క్క అ-త్త . పథములేర్పడెను. శిశువునకు నిత్యసన్నిహితులగు తలిదండ్రులకు, అన్నలక్కలకు అవి వాచకము లయ్యెను. -ప్ప ఒక్క యక్కరమే యగునపుడు పూర్వమున్న అ-ప్ప-ప్ప పలికినపుడు - పాప, బాబ, అయినది. -మ్మ -మామ అయినది. అత్త-తాత అయినది. -క్క-కాక అయినది. ఇట్లు చూడఁగా:

అమ - అమ్మ - మామ - మామ్మ - అమ్మమ్మ
అన - అన్న - నాన - నాన్న
అక - అక్క - కాక - కక్క
        అత్త - తాత
        అబ్బ - బాబ
        అప్ప - పాప - రూపము లేర్పడినవి.