పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీశాస్త్రిగారు బహుముఖప్రజ్ఞాశాలి. వారి హృదయం స్పృశింపని విషయం లేదు. నన్నయ నుండి నారాయణుని వరకూ, భాషాశాస్త్రం నుండి భాషావధూటి వరకూ - అక్షరంనుండి అక్షరతత్త్వంవరకూ - యోగంనుండి యోగేశ్వరుని వరకూ, పరమాన్నంనుండి పరమాత్మవరకూ సజీవస్రవంతిగా ప్రవహించింది - ప్రవహిస్తూంది - ప్రవహిస్తుంది - శ్రీశాస్త్రిగారి 'అక్షరగంగ' వీరి పరిశోధనలూ, విమర్శలూ సాహితీకృషీవలులకు బంగారుపంటను పండిస్తాయి. నూతనాలోచనలనూ, పరిశోధనాసక్తినీ ఇనుమడింప జేస్తాయి. గుణాన్ని గుణంగా, దోషాన్ని దోషంగా వివరించడంలో శ్రీశాస్త్రిగారు "నిర్మొగమోటం"గా వ్యవహరించడం వీరి వ్యాసాల ద్వారా వ్యక్తమవుతూంది. ముఖప్రీతికీ - సాహితీప్రీతికీ పొత్తు కుదురదు కదా!

శ్రీశాస్త్రిగారు సమాజానికి త్రికరణశుద్ధిగా - త్రికరణాలకూ సేవచేసిన ధన్యులు!

శ్రీశాస్త్రిగారి 120 వ జయంతి సందర్భంగా పునర్ముద్రించిన నాల్గుపుస్తకాలూ సాహితీసౌధానికి నాల్గుస్తంభాలు. ఇందులో ముఖ్యాముఖ్యాలకు తావు లేదు. దేని ప్రాముఖ్యం, విశిష్టత దానిదే! సహృదయ సాహితీలోకం ఆ విశిష్టతకు దర్పಣಂ.

శ్రీశాస్త్రిగారి కాంస్య విగ్రహాన్ని 'శ్వేత'కు ఎదురుగా స్థాపించడం ద్వారా తిరుమల తిరుపతి దేవస్థాన ఉద్యోగులకే కాక, 'శ్వేత'ను, అటు శ్రీవేంకటేశ్వరవిశ్వ విద్యాలయాన్నీ దర్శించి, ఉభయత్ర - అనేకకార్యక్రమాలపై వచ్చే విద్యార్థులకూ, పెద్దలకూ కూడ శాస్త్రిగారినిగూర్చిన పరిచయం, అవగాహన చేకూర్తుంది. ఈ నిర్ణయం మిక్కిలి అభినందనీయం!

శ్రీశాస్త్రిగారి జయంతి, వర్ధంతి - సందర్భంగా క్రమంగా వారి రచనలు ముద్రింపబడి - సాహితీప్రియులకు అందుబాటులో ఉండేవిధంగా కృషి జరుగుతూంది.

ప్రతిఫలాపేక్ష లేకుండా, నిస్స్వార్ధంగా, నిష్కళంకంగా సాహితీసమాజసేవతో ధన్యులైన శాస్త్రిగారు ఆదర్శ పండితులు. పరిశోధక శిరోమణులు. ఉత్తమ యోగం.

కృతజ్ఞతాంజలులతో,

శ్రీవారి సేవలో

పమిడి కాల్వ చెంచుసుబ్బయ్య

(పమిడికాల చెంచుసుబ్జయు)

తిరుపతి,

29.01.2008