పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/168

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మీఁగడ తఱకలు

149


మూఁడవనాఁడు నట్లే యూతఁడు తన్ని క్షమధ్వము చెప్పెను. కోపాటోపముతో లేచి యా పెద్దయాతఁ డీపిన్న యాతని సిగ పట్టు కొని వంగలాగి "పొగరుఁబోతా! ప్రతిదినముఁ దన్నుచు నొకటే క్షమధ్వము చెప్పసాగించితివి. నీ కొకక్షమధ్వము వచ్చిన నాకు ముప్పదిరెండు శ్రయధ్వములు వచ్చును. ఏమనుకొన్నావో నా దెబ్బ చూచికొ" మ్మని "ప్రథమా ద్వితీయేషు శ్రయధ్వం, ద్వితీయా స్తృతీయేషు శ్రయధ్వం, తృతీయా శ్చతుర్దేషు శ్రయధ్వం", (ఇట్లు ముప్పది రెండు శ్రయధ్వములు గల వేదమంత్ర మున్నది.) అని సస్వరముగాఁ జదువుచు నొక్కొక్క శ్రయధ్వమున కొక్కొక గ్రుద్దుచొప్పున ముప్పదిరెండు గ్రుద్దులు వెన్నెముకలు విఱుగునట్లు వీఁపుమీఁదఁ దగిలించెను. అవమానితుఁడై పిన్నయల్లుఁ డడఁగియుండెను. అనేకు లీకథను పెద్దిభట్టుపేరఁ జెప్పుదురు. తన్నులు తగిలిన వనుటకు శ్రయధ్వము లయిన వనుట పారిభాషికముగా వైదికుల వాడుకలో నున్నది.

ఎల్లప్పుడును సుకవిసూక్తిరసాస్వాదనతత్పరుఁడుగా నుండు నీ పెద్దిభట్టు స్త్రీవర్ణనమున మంచిమంచిశ్లోకములను జదువుచుండఁగా వినుచున్న దై యాతనియిల్లా లొకనాc డిట్లు వేఁడుకొన్నదఁట ! వారిని వారిని వర్ణించినశ్లోకములను జదువుచుందురేగాని న న్నొకనాఁడైన వర్ణింపరైతిరి గదా" యని. నాఁ డిట్లు వర్ణించినాఁడు పెద్దిభట్టు !

శ్లో!! మేరుమందరసమానమధ్యమా తింత్రిణీదళవిశాలలోచనా
      అర్కశుష్కఫలకోమలస్తనీ పెద్దిభట్టగృహిణీ విరాజతే!

గ్రంథవ్యాఖ్యానదీక్షతోఁ గాల మెల్లఁ గడపుచుఁ బెద్దిభ ట్టింటిపని నంటించుకొనకుండెను. ఇత్యర్థః ఇతిభావః, అనుచు నీయన కూరుచుండుట వలన నిల్లాలికి గృహనిర్వాహము దుష్కర మగుచుండెను. ఒకనాఁ డొక యాప్తవిద్వాంసుఁ డతిథియై యింటికి రాఁగా నేఁ డేమికూరగాయలు వండెద వని పెద్దిభట్టు భార్య నడిగెను. ఆమె యిట్లు బదులు చెప్పెను. "ఇత్యర్ధముల కూర-ఇతిభావముల పులుసు"-వండెదను. మీ రింటినిండ నించుచున్న పదార్ధము లివేకదా!