పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/167

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

148

మీఁగడ తఱకలు


శ్లో!! కిం వాససా చీకిరిబాకిరేణ కిం దారుణా వంకరటింకరేణ
      సర్వజ్ఞ భూపాలవిలోకనార్థం వైదుష్య మేకం విదుషాం సహాయమ్.

పెద్దిభ ట్టొకనాఁడు చీఁకిరిబాఁకిరిచినుఁగులప్రాఁత కట్టుకొని వంకరటింకరకఱ్ఱ చేతఁ బట్టుకొని సర్వజ్ఞసింగభూపతి విద్వత్సభకుఁ బోవుచుండఁ ద్రోవలో నెవరో యడిగిరఁట, తాతగారూ! రాజసభ కిట్టివేషముతోఁ బోవుచున్నారే మని. అప్పుడాయన పై శ్లోకము చెప్పెనఁట.

మఱియుఁ బెద్దిభట్టు గణాధిపప్రసాదముగలవాఁ డని చంపూరామాయణ వ్యాఖ్యాదిశ్లోకములం దున్నది. రఘువంశాది వ్యాఖ్యలందుఁ బ్రధానముగాఁ జేసిన గణపతిస్తుతిశ్లోకము లున్నవి.

పెద్దిభట్టుపేర నీక్రిందికథలను కొందఱు చెప్పుచున్నారు. "పెద్దిభట్టుతోడియల్లుఁడు ఘనాంతము వేదవిద్య నేర్చినవాఁడు. మంచి కండపుష్టి కలవాcడు. పెద్దిభట్టు మంచిసంస్కృత సాహిత్యము, శాస్త్ర పాండిత్యముఁ గలవాఁడుగదా! పెద్దయల్లుఁడగునావేదముగ్దుఁడును జిన్నయల్లుఁ డగునీశాస్త్రచతురుఁడును నత్తవారింటి కేకకాలమున నొకప్పు డేతెంచిరి. అత్తమామ లా పెద్దయల్లు నలక్ష్యముతో నగౌరవముతోను, నీపిన్నయల్లుని మన్ననతో మర్యాదతోను జూడసాగిరి. ఆతని వేదవైదుష్యమును వెక్కిరించి-యీతనిశాస్త్రచాతుర్యమును సన్నుతించిరి. ఆతనికి నడవలోఁ జాఁపమీఁదను, నీతనికిఁ బడుకగదిలోఁ బట్టెమంచముమీఁదను శయనవిధాన మేర్పఱచిరి. పె ద్దాతఁడు కోపమునఁ గుములుచుండెను. పిన్నాతఁ డుత్సాహమున నుప్పొంగు చుండెను. పడుకగదినుండి రాత్రి లఘుశంకకు బయలి కేఁగుచు నీపిన్నాతఁడు త్రోవలో నడవలోఁ బండుకొనియున్న తోడియల్లు నొకతన్ను తన్ని యెఱుఁగక ప్రమాదమునఁ దన్ని నట్టు నటించి "క్షమధ్వమ్" అని బుజ్జగించి పోవుచుండెను. ఒకనాc డాయెను. రెణ్ణా ళ్ళాయెను. అనుదినము నట్లే తన్నుచు "క్షమధ్వమ్" చెప్పుచుండ సాగించెను. ఒకనాఁడు రెణ్ణాళ్లు ఓర్చుకొనెను. కాని పెద్దయాతఁ డామీఁద నాగఁజాలఁ డయ్యెను.