పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మీఁగడ తఱకలు

147


గుర్తించిరి. మఱియుఁ గొన్నిచోట్ల “తథా చ చాక్షుషః" అని యున్నది. చాక్షుషుఁ డెవరో ఏమిగ్రంథము రచించెనో తెలియ దయ్యెను. ఇది రాజనీతిగ్రంథ మని శ్రీకవిగారే గుర్తింపఁగల్గినారు. మల్లినాథుఁ డుదాహరించినమహాయాత్ర యను గ్రంథ మిట్టి దని యిదివఱ కెఱుఁగ రా కుండెను. అది యిప్పుడు ప్రాచ్యలిఖితపుస్తకశాలకు లభించినది. శాకునగ్రంథ మృగచర్మీయము రాజపుత్రీయము మొదలగుగ్రంథము లిప్పుడు దొరకకున్నవి. ఉభయమీమాంసలందును నుభయతర్కము లందును బ్రాచీనగ్రంథము లీయన యుదాహరించినాఁడు. చార్వాక బౌద్ధగ్రంథముల నుదాహరించినాఁడు. అందుఁ గొన్ని యిప్పడు కానరా కున్నవి. పంచకావ్యవ్యాఖ్యలం దీయన దక్షిణావర్తనాథుఁడను నొక ప్రాచీన వ్యాఖ్యాతను "నాథవచన మనాథవచనమేవ" ఇత్యాదివిధముల గర్హించినాఁడు. దక్షిణావర్తనాథునివ్యాఖ్య లిప్పుడు దొరకినవి.

మల్లినాథుఁడు రచియించినగ్రంథము లివి తెలియవచ్చుచున్నవి. రఘువంశ, కుమారసంభవ, మేఘసందేశ, కిరాతార్జునీయశిశుపాలవధము లను పంచకావ్యములకు వ్యాఖ్యలు, నైషధవ్యాఖ్య, భట్టికావ్యవ్యాఖ్య, ఏకావళివ్యాఖ్య తంత్రవార్తిటీక, సర్వమంజరీ వ్యాఖ్య (పరిమళము), తార్కిక రక్షటీక, జ్యౌతిషగ్రంథము, రఘువీరచరిత (?) రఘువీరచరితము మల్లినాథకృతి యగునో కాదో !

మీఁద నుదాహరింపఁబడిన చంపూరామాయణ వ్యాఖ్యాత శ్లోకములందుఁ బెద్దిభట్టు సర్వజ్ఞ సింగభూపాలునిచే (మాతులేయక్రతౌ? కృతౌ?) మేనమామ కుమారుని యజ్ఞమునఁ గనకాభిషేకసత్కార మందినట్టున్నది. సర్వజ్ఞసింగభూపాలకృతి యగురసార్ణవసుధాకరము నీతఁడు తనవ్యాఖ్యలం దుదాహరించినాఁడు. సర్వజ్ఞసింగభూపాలుని సమ్మానాభిమానము నిట్టు పెద్దిభట్టు చూపినాఁ డనుకొనుచున్నాను. పెద్దిభట్టు సర్వజ్ఞ సింగభూపతికాలమున నున్నవాఁ డనుటకు సాధకముగా నీ క్రింది.శ్లోకము నా కొకచోటఁ జేకూడినది.