పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/16

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డదిఓం నమో వేంకటేశాయ

కృతజ్ఞతాంజలి

విద్వాన్, డాక్టర్ పమిడికాల్వచెంచుసుబ్బయ్య

సమన్వయ కర్త,

శ్రీమాన్ వేటూరిప్రభాకరశాస్త్రి వాఙ్మయపీఠము,

'శ్వేత' భవనము, తి.తి. దేవస్థానములు, తిరుపతి.

తిరుమల తిరుపతి దేవస్థానంవారి హిందూ ధర్మప్రచార పరిషత్ కార్యదర్శి పదవినుండి స్వచ్ఛందంగా నా అంతట నేనే వైదొలగినా - నాపై విశ్వాసాభిమానా లుంచి, నన్ను శ్రీమాన్ వేటూరి ప్రభాకరశాస్త్రివాఙ్మయపీఠానికి సమన్వయకర్తగా మరియు మాతృశ్రీతరిగొండవెంగమాంబ వాఙ్మయప్రాజెక్టుకు ఇంఛార్జి సమన్వయకర్తగా నియమించిన పాలకమండలి అధ్యక్షులు గౌరవశ్రీ భూమన కరుణాకరరెడ్డిగారికీ, గౌరవశ్రీ పాలకమండలి సభ్యులకూ, కార్యనిర్వహణాధికారి మాన్యశ్రీ కె.వి. రమణాచారి, ఐ.ఎ.ఎస్. గారికీ తదితర ఉన్నతాధికారవర్గానికీ, ఈ నియామకంలో తమ సంపూర్ణసహకారాన్ని అందించిన 'శ్వేత' సంచాలకులు మాన్యశ్రీ భూమన్‌గారికీ హార్దకృతజ్ఞతాంజలులు.

శ్రీవేటూరి ప్రభాకరశాస్త్రిగారి “సింహావలోకనం" ఒకప్పుడు విద్వాన్ కోర్సుకు పాఠ్యాంశంగా ఉండేది. బోధన సందర్భంగా ఆ పుస్తకాన్ని చదివే భాగ్యం చేకూరింది. అప్పుడు అనిపించింది - శ్రీవేటూరివారి పాండితీగరిమ, విమర్శన నైపుణ్యం, రచనలో వారు పాటించే నిబద్ధత, గ్రాంథికభాషపై, ప్రాచీన సాహిత్యంపై వారికున్న సునిశిత పరిశోధన హృదయం, అనితర సాధ్యమైన వని. ఆనాడే వారిపై ఎనలేని గౌరవం ఏర్పడింది.

ఏ జన్మాంతరబంధమో - ఎందరో ప్రత్యక్షశిష్యు లున్నా - పరోక్ష శిష్యుణ్ణైన నాకు శ్రీశాస్త్రిగారి వాఙ్మయానికి సేవ చేసే భాగ్యం - శ్రీనివాసుని కృపాకటాక్షంతో లభించింది. మొదట్నుంచీ ప్రాచీన సాహిత్యంపై మక్కువ ఎక్కువున్న నాకు ఈ సేవ లభించడం మహాదృష్టం!

ప్రస్తుతం ఇప్పు డిప్పడే ఈ వాఙ్మయపీఠం రూపురేఖలుదిద్దుకొంటూంది. శ్రీశాస్త్రిగారి సాహిత్యం - వ్రాతప్రతులూ ఇంకా చేరవలసినవి చాలా ఉన్నాయి. వాటి ఆధారంగా అనేక కోణాల్లో పరిశోధనలు జరిగి, విలువైన ప్రాచీన సంపద ఆంధ్రసాహితీ ప్రియులకు అందించాల్సిన బాధ్యత పీఠంపై ఉన్నది. ఈ దిశగా కృషి జరుగుచున్నది.