పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మీఁగడ తఱకలు

139


పై విధమున విజయరాఘవనాయనిరచనలు, నాఁటికవ యిత్రులయు, కవులయు రచనలు, పలుకుపొంకము, సౌలభ్యము, మృదుపాకము గల వయినను, బరువము దప్పిన పచ్చి శృంగారముతో గోవాళ్లను ద్రోవ దప్పించునవిగా నున్నవి. యక్షగానములే యం దనేకములు. తంజావూరి నాటకశాలలో నా యక్షగానములను బిరుదుపాత్ర లభినయించు వారు. విజయరాఘవనాయనిగా రాయా బిరుదుపాత్రలకు శారదాధ్వజాదు లొసఁగి సత్కరించుచుండువారు. అంతయు నాటలమయము, పాటల మయముగా విజయరాఘవనాయని గోష్ఠి విరాజిల్లినది. నాయకరాజుల తర్వాత వచ్చినమహారాష్ట్రరాజులుగూడ నీయక్షగానవినోదములలో మునిఁగి తేలుచుండువా రనుటకు వారినాళ్లలోఁగూడ వెలసినయక్షగానము లనేకములు తార్కాణ.

రఘునాథరాయలవారినాఁటిరచనలే తంజావూరిరచనలలోc బ్రశస్తమయినవి. రఘునాథరాయలు, చేమకూర వెంకటకవి, కట్టా వరదరాజు, ముకుందయోగి, కృష్ణాధ్వరి, చెంగల్వ కాళయ, చల్లపల్లి రంగన్న వెంకటాచలవిలాసకర్త మొదలగువారి రచనలు తంజాపురాంధ్ర రచనలలో మెచ్చఁదగినవి.

అన్నింటిలోనూ కట్టా వరదరాజు ద్విపదరామాయణము[1] ముద్రితమై ముందర వెలయఁదగినది. అతని శ్రీరంగమాహాత్మ్య మొక్కటే ముద్రిత మయినది. పరమభాగవతచరిత్రము సమగ్రముగా దొరకకున్నను ముద్రింపఁదగినదే.

కవిత లంటే విసువు పుట్టే కాలమున శృంగారరచనల
దవిలి యేదే వ్రాయబోతే తారుమారు లవున్
అవకతవకలు నౌ నికేమో అవును, గావున రసికయువకులు
సవరణలతో సయిరణలతో జదువుకొనవలయున్,

  • * *
  1. తంజావూరి లైబ్రరీవా రిటీవలనే దీనిని ముద్రించిరి.