పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/145

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

126

మీఁగడ తఱకలు


సామ్రాజ్యలక్ష్మీపీఠికాతంత్రమునను, నభిలషితార్థచింతామణిలోను నున్నవి. రాయవాచకమున కృష్ణరాయల దినచర్యాది విధానమునే తంజావూరిరాజులును బాటించిరి. నేఁటికిని మైసూరురాజ్య మావిధానమును గొంత పాటించుచున్నది. తంజావూరిలో నాట్యశాలాది నిర్మాణములు అభిలషితార్థ చింతామణి, సామ్రాజ్యలక్ష్మీ పీఠికాతంత్రాది గ్రంథోక్తరీతుల ననువర్తించుచున్నది. ఆయా విషయముల నెల్ల సరిపోల్చి చూపుటకు ప్రత్యేక పరిశీలనము చాల గావలెను.

తంజావూరిలో చెవ్వప్పనాయకుడు, అచ్యుతప్ప నాయకుడు, ప్రధానముగ రాజ్యపాలన స్వాస్థ్యములయం దధికముగా నాదరము చూపిరి. కాని రఘునాథ, విజయరాఘవ నాయకులు క్రీ.శ.1650 ప్రాంతములనుండి రాజ్యవైభవానుభవములతో పాటు దేవాలయాది నిర్మాణములు, తదుత్సవాదివిశేషములు, సంస్కృతాంధ్రదవిడరచన ప్రోత్సాహములు, తత్కవిసత్కారములు, సంగీతవినోదములు, నాట్య వినోదములు, అందు నధికముగ నాంధ్రకవితాగాననాట్య వినోదములు గలవారై యఖండానంద మనుభవించి, ప్రజాసామాన్యమునుగూడ ననుభవింపఁజేసిరి. ఏవంవిధవినోదమునం బాల్గొనువారికి నిరంతరాన్న దానసత్రములను వెలయించిరి. ఆనాఁ డాంధ్రదేశమునుండి సత్కారముఁ బడయుట కెందఱో తంజాపూర్యాదిస్థలముల కరిగి, రాజాదరము పడసి, యక్కడనే నెలకొనిపోయిరి. వారు రచించిన గ్రంథము లనేకము లున్నవి. ఆయాకవుల గ్రంధముల జాబితాల నిక్కడ ప్రకటించుట నాపని కాదు. అది సుందరమును గాదు. లభించిన యన్నిగ్రంథములనుగూర్చి విమర్శము వెలయించుటయు నల్పవ్యవధిలో నంత సుకరము గాదు.

తంజావూరిగ్రంథములలో విశిష్టయోగ్యత గల గ్రంథములను గొన్నింటినిగూర్చిమాత్రమే, విశేషాంశములనే, క్రొత్తవానినే యిక్కడ వివరింపఁ బూనితిని,