పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మీఁగడ తఱకలు

121

వరూధినికిఁ బ్రవరునియందే గాని గంధర్వునియం దను రాగము లేదు. నిజప్రవరునికిఁ దనసోమిదమ్మయందేగాని వరూధినియం దనురాగము లేదు.

"యాం చింతయామి సతతం మయి సా విరక్తా
 సా చాన్య మిచ్ఛతి జనం స జన్యో న్యరక్తః
అస్మత్కృతే చ పరితప్యతి కాచి దన్యా
ధిక్తాంచ తం చ మదనం చ ఇమాం చ మాం చ."

అనినభర్తృహరిసుభాషిత మిచ్చట సరిపోవును.

ఈ విషయ మి ట్లుండినప్పటికిని వరూధినీ ప్రవర సంవాద వుట్టమునఁ బెద్దన నిర్వహించిననెఱజాణతనపుఁగవన మాంధ్ర సారస్వత మంతకు నద్వితీయ మయినది.

పెద్దన్నగారు శృంగారధర్మవీరముల కనుఁడు, శృంగారశాంతముల కనుcడు, ఎ ట్లన్నను నిక్కడ నడిపించినపోరాటము యుక్తిప్రయుక్తులు, రచనాచమత్కారము, శయ్యాసౌభాగ్యము, భాషాసౌందర్యము నిస్సామాన్య మయినవి. కృష్ణరాయలవంటి మహారాజు దగ్గఱనుండి, నేఁటి తెలుగు సహృదయు లందరిదాఁక నీ రచనాఘట్టము పెద్దనగారిపై నఖండ గౌరవమును, మనుచరిత్రకు నఖండప్రఖ్యాతిని గల్పించినది.

ఈ కథ కల్పించిన రసపారవశ్యమున, నాఁటినుండి నేcటిదాక సహృదయప్రపంచము దానిలోని లోపములను వేనిని వెదకి పట్టుప్రయత్నము సేయలేని దయినది.

వరూధినీకామాగ్నిలో మైనమై కరఁగి పోక వజ్రహృదయుఁడై నిలిచి శీలరక్షణ చేసికొన్నప్రవరుని మహనీయతను ప్రజ్వరిల్లఁ జేయుటలో పెద్దన నిర్వహించిననెఱజాణతన మాంధ్రసారస్వతమున మణి యన్యత్ర దొరకనిది. అద్భుతమైనది.

ఈ కథా ఘట్టమే రాయలసభలోఁ బెద్దన నష్టదిగ్గజములలోఁ దూర్పుదిగ్గజముగాఁ గావించినది. అగ్రహారము లిప్పించినది. రాయలరాజ్యములోఁ గడలూరి గవర్నరుగాఁ జేసినది.