పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

112

మీఁగడ తఱకలు


లేకపోవుటయుఁ గాలముసరిపడకపోవుటయుఁ గొంతబాధకమగుచున్నది. ఈప్రబంధమున నుద్భటుఁడు ముంజభోజునికి శైవదీక్ష నొసఁగిన గురువుగాఁ జెప్పఁ బడినాఁడు. ముంజభోజుఁడు దశమ శతాబ్దివాఁడు. ఉద్భటుని గ్రంథము లీభోజుని కింకను బూర్వకాలముననే పుట్టినవి. ఈయుద్భటారాధ్యచరిత్రలో ముంజభోజుని పేరున్నను దీని కాకరమయిన బసవపురాణమున భోజుఁ డనిమాత్రమే యున్నది. పలువురు భోజు లున్నారుగాన యీతఁ డాకాలమువాఁ డయినను గావచ్చును. ముంజభోజుఁ డనుట రామలింగకవి స్వకల్పితముగాన యది యప్రమాణ మని త్రోసివేయవచ్చును. ముదిగొండవా రని యిప్పు డాంధ్రదేశమునఁ బ్రఖ్యాతులుగా నున్నయారాధ్యబ్రాహ్మణుల కీయుద్భటారాధ్యుఁడు మూలపురుషుఁ డని యీప్రబంధమందుఁ గలదు. ఆయుద్భటుని దగ్గఱనుండి ముదిగొండవారివంశక్రమముగూడఁ గొంత గ్రంథాంతమున గానవచ్చుచున్నది. ఈవంశక్రమము పాల్కురికి సోమనాథుని గ్రంథమునఁ గానరాదు. [1]కర్ణాటభాషలోగూడ నుద్భట చరిత్రములు గలవు. సోమరాజకవి బసవాంకకవి యనువా రిర్వురు వానిని రచించిరి. పాల్కురికి సోమనాథుఁడు కుమారపాలఘార్జరునిదిగాఁ జెప్పిన కథనే కర్ణాటక కవు లుద్భటుని కథగాఁజెప్పిరి. ఆ కర్ణాటక కవులకంటె మన సోమనాథుఁడు పూర్వఁడు. కుమారపాలున కుద్భటదేవుఁ డని నామాంతరముగా నా యుద్భటదేవచరిత్ర పీఠికలో శ్రీశ్యామాచార్యులు గారు వ్రాసిరి. అదియెట్లో? మల్లికార్జున పండితారాధ్యుడు, సోమనాథుఁడు వారినిర్వురను వేర్వేఱుగాc బేర్కొనిరి. కుమారపాలుని చరిత్రమున నాతని కానామాంతర మున్నట్టు చెప్పరయిరి. పాల్కురికి సోమనకథ చొప్పున రచియింపఁబడిన యీ యుద్భటారాధ్యచరిత్రమునకును, నాకర్ణాట ప్రబంధములకును నేమియు సంబంధమును గానరాదు.

  • * *
  1. చంద్రశేఖరగురునివఱకు నావంశక్రమ మున్నది. ఈచంద్రశేఖరుఁడే దేచయమంత్రి గురుఁ డగునని నే ననుకొనుచున్నాను.