పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/122

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మీఁగడ తఱకలు

103


మ|| శుకముల్ ప్రామినుకుల్ గుణించు గణియించున్ ధర్మమర్మేతిహా
       సకథల్ శారిక లీరిక ల్గొను మనీషన్ శేషభాషావిశే
       షకళాశాస్త్ర ముపన్యసించు బకముల్ సాత్రాజితీప్రాణనా
       యకనామాళి నళుల్ పఠించు సతతోద్యద్గీతికాచాతురిన్

సీ|| నునుగాలిదూదిపానుపు లెన్నియో కాని
                  యందఱు శయనీకృతాహివరులు
     సురలోకవాహిని ర్ఘరము లెన్నియొ కాని
                 యందఱు దివ్యతీర్ధాంబుపదులు
     నీట జనించుమానికము లెన్నియొ కాని
                 యందఱు కౌస్తుభహారయుతులు
     చలివేఁడి వెలుఁగులసాము లెందఱొ కాని
                 యందఱు నిందుకంజాప్తదృశులు

గీ|| ఖగకులాధీశు లెందఱు కలరొ కాని
     యందఱును బుల్గురాటెక్కియములవారు
     నారు వోసినరీతి నున్నారు ధీరు
     లన్నగరియందుఁ గాపురం బున్నవారు
                            -ఘటికాచలమాహాత్మ్యము. [1]

ఉద్భటారాధ్య చరిత్రపద్యముల ఛాయ గలపద్యములు పాండురంగ మాహాత్మ్యమునఁగూడ లేకపోలేదు కాని ప్రౌఢతర మయినరచన మగుటచేఁ బాండురంగమాహాత్మ్యమున నీవిధముగాఁ బాడినపాటయే యునఁ దగుపద్యములు గానరావు. ఈ సాధనము లన్నియు రామలింగఁడే రామకృష్ణుఁ డయ్యె ననుసిద్ధాంతమును నిర్వివాదముగా నెలకొల్పఁగల వని నానమ్మకము.

  1. ఘటికాచలమాహాత్మ్యము తెనాలిరామకృష్ణకవిరచిత మయినను నది యాతని మనుమనికాలమున (ఆమనుమని పేరు లేదు) ఖండోజిరాయఁడను మహారాష్ట్రునకుఁ గృతి యీయఁబడినది. కాన యందుఁ గృత్యవతరణిక రామకృష్ణుని రచనము గాదు. రామకృష్ణుని విషయ మం దేమియు లేదు. అది కలావతీ ముద్రాక్షరశాలలో 1902 సం|| ముద్రిత మయ్యెను.