పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/112

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

9

ఉద్భటారాధ్య చరిత్రము

ఉద్భటారాధ్య చరిత్ర మపూర్వసత్ప్రబంధములలో నొక్కటి. దీనికి

కర్త - తెనాలిరామలింగకవి

అనఁగానే దీని సత్ప్రబంధత్వము గొంత సమర్ధిత మగును గదా! తెనాలిరామలింగకవి యని తెనాలి రామకృష్ణకవి యని యొక్కనినే యటు నిటు గూడ లోకము పేర్కొనుట గలదు. తొలుత నాతఁడు శైవుఁ డనియు, నప్పుడు రామలింగఁ డని పే రయ్యె ననియుఁ, దర్వాత వైష్ణవము పుచ్చుకొనె ననియు, నప్పుడు రామకృష్ణుఁ డని మార్పురే రయ్యె ననియుఁ బ్రతీతి. దీనిని వీరేశలింగము పంతులుగారు మొదలగువారు గొందఱు నమ్మిరి. మఱికొందఱు నమ్మరయిరి.[1] ఆ రేండు పేళ్లు నొక్కనివే యని నేనును విశ్వసించుచున్నాఁడను. అట్లు విశ్వసించుట కిదివఱకున్న యాయైతిహ్యము మాత్రమే కాక యపూర్వముగాఁ గొన్నియాధారములును నా కగపడినవి. తెలుపుచున్నాఁడను.

రామలింగఁడే - రామకృష్ణుఁడు

రామకృష్ణకవికృతములుగా నిదివఱకు దొరకి ప్రకటితములయియున్న గ్రంథములు రెండు, అవి పాండురంగమాహాత్మ్యమును, ఘటికాచలమాహాత్మ్యమును. రామలింగకవికృతిగా నిప్పుడు క్రొత్తగా దొరకి ప్రకటిత మయినది - యుద్భటారాధ్య చరిత్రము. తొల్త నాతఁడు శైవుఁ డుగా నుండి తర్వాత వైష్ణవుఁడుగా మాఱె ననియే నే నిందు ముందు నిరూపింపనున్నాఁడనుగాన యుద్భటారాధ్యచరిత్రము మునుపటి గ్రంథముగాను తక్కిన రెంటిని దర్వాతివానిఁగాను దెలుపుచున్నాఁడను.

  1. విశ్వకర్మవంశ్యుఁడు, ధీరజనమనోరంజనకర్త, తెనాలిరామలింగకవి యొకఁడున్నాఁడు. ఆతఁడు వేఱు.