పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/107

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

88

మీఁగడ తఱకలుఇంకొక విశేషము

ఈ భండారులక్ష్మీనారాయణుఁ డిట్లు కృతికర్త యగుటే కాక మఱి కృతిభర్తయునయిన ట్లెఱుగఁబడుచున్నాఁడు. భానుకవి యని యొక తెనుఁగుకవి యితని కంకితముగాఁ బంచతంత్రిని దెనిఁగించినాఁడు. చిట్టయమంత్రి (చిట్టమరసు?) ప్రేరణచే నరసింహభట్టు, నరసమంత్రి, అవధానము కృష్ణఘనుఁడు, భరతము విష్ణుభట్టు (ఈతఁడే లక్ష్మీ నారాయుణునకు సంగీతాగమము నుపదేశించినవాఁడు) అనువారు సమ్మతించి ప్రోత్సాహపఱుపఁగా లక్ష్మీనారాయణుఁ డీభానుకవిని దనపేరఁ బంచతంత్రిని దెలిఁగింపఁ గోరినాఁ డఁట! భానుకవి తనకృతిపతి సంగీతసూర్యోదయము రచించె నని చెప్పలేదు గాని యాతనిబిరుదములను, నభినవభరతాచార్యాదులను దఱచుగా గ్రంథమునఁ బేర్కొన్నాఁడు.

క|| పతికంటె మంత్రి బలిసిన క్షితి యాతనిదై తనర్చు సిద్ధము సతి దాఁ
     బతికంటె ఠవర యైనను బతి కార్యము చెడును నూత్నభరతాచార్యా!

     విద్యానగరము నీతఁ డిట్లు ప్రశంసించినాఁడు.

సీ|| పంపావిరూపాక్షభైరవవిట్ఠలేశ్వరముఖ్య దేవతావ్రజముచేత
      పరిపంథిగర్వవిభాళనశ్రీకృష్ణ రాయభూధవభుజారక్షచేత
      భటనటజ్యౌతిషపౌరాణికభిషగ్విచక్షణసత్కవీశ్వరులచేత
      సంతతమదవాహిచారుశుండాలస్బుటాజవప్రకటఫలోటములచేత

గీ|| రమ్యమై యుండువిద్యాపురంబునందు
     నిమ్మహాకృతి భానుకవీశ్వరుండు
     తెనుఁగుబాస నొనర్చెను వినుతి కెక్క
     నవని నాచంద్రతారార్క మగుచుఁ దనర

ఈ పంచతంత్రిలోని కథలోఁగూడ నీతిపద్యములు కృతిపతి సంబోధనముతో నున్నవి. "కరణికలక్ష్మి, సూక్ష్మలిఖితాచార్య, విట్ఠయలక్ష్మధీమణీ" ఇత్యాదులు. ఇట్టి సంబోధనములవలన నీతఁడు సంగీతాచార్యుఁ డే కాక మంత్రియు నని యెఱుఁగ నగుచున్నది.