మతము-పథము
భూమండలములో దేవున్ని విశ్వసించిన మనుషులను మూడు భాగములుగ విభజించవచ్చును. అలాగే దేవున్ని విశ్వసించిన మతములను కూడ మూడుగానే చెప్పుకోవచ్చును. ఆ మూడు మతములలో ప్రాచీనమైనది, అన్నిటికంటే ముందు పుట్టినది హిందూమతము, తర్వాత పుట్టినది క్రైస్తవ మతము, ఆ తర్వాత పుట్టినది ఇస్లామ్‌మతము. ముఖ్యమైన ఈ మూడు మతములలో దేవున్ని గురించి విపులముగా, చాలా దగ్గరగా బోధించినది హిందూమతములోని బోధయేనని చెప్పవచ్చును. తర్వాత బోధలో రెండవ స్థానములో ఉన్నది క్రైస్తవమతము. అలాగే బోధలో మూడవ స్థానమును పొందినది ఇస్లామ్‌మతము.
బోధలలో మూడవస్థానములో ఇస్లామ్ ఉన్నప్పటికి దేవుని మార్గములో మొదటిది, దేవున్ని పూర్తి విశ్వసించినది, దేవునికి చాలా దగ్గరగాయున్నది ఇస్లామ్‌మతమేనని చెప్పవచ్చును. అలాగే విశ్వాసములోగానీ, సావిూప్యములోగానీ రెండవస్థానములో ఉన్నది క్రైస్తవమతము. చివరిగా మూడవస్థానములో ఉన్నది హిందూమతమని చెప్పవచ్చును. ఒక లెక్కప్రకారము చెప్పుకొంటే ఇస్లామ్‌మతములో దేవుని విూద విశ్వాసము 90 శాతము ఉండగా, క్రైస్తవమతములో 50 శాతము గలదు. చివరిలోనున్న హిందూమతములో కేవలము 2 శాతముగానీ దానికంటే తక్కువగానీ కలదని చెప్పవచ్చును. ఇక్కడ ఇపుడు విూకొక ప్రశ్నవచ్చి నన్నడుగవచ్చును. ప్రశ్న ఏమనగా! ఇస్లామ్ మరియు క్రైస్తవులకంటే పూజలు చేయువారూ, గుడులకు పోవువారూ, యజ్ఞములు చేయువారూ, బోధలు చెప్పు స్వావిూజీలూ, మహత్యములు చూపు బాబాలు ఎందరో ఉండగా హిందూ మతములో ఎంతో హీనముగా కేవలము 2 శాతమే విశ్వాసముంది అంటున్నారేమిటి?