పుట:Matamu-Pathamu.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దేవుని జ్ఞానమునకు వ్యతిరేకముగా మాయ తన జ్ఞానమును దేవుని జ్ఞానమువలె ప్రచారము చేసి ఏది దేవుని జ్ఞానమో, ఏది మాయ జ్ఞానమో అర్థము కాకుండ చేయును. అలాంటి పరిస్థితులలో దైవజ్ఞానము విూద ఆసక్తి కలవారందరు దేవుని జ్ఞానము మాదిరియున్న మాయ జ్ఞానమును దైవజ్ఞానముగా లెక్కించి దానినే తెలుసుకొను అవకాశము గలదు. మానవులను దేవుని వైపు పోకుండ చేయుటకు, తనవైపుకు వచ్చుటకు మాయ ఎంతోమంది స్వామిజీల చేత తన జ్ఞానమును చెప్పించుచున్నది. మాయ తనయొక్క జ్ఞానమును ప్రచారము చేయువారికి పెద్ద పెద్ద బిరుదులను అంటకట్టి వారినే ప్రజలు నమ్మునట్లు చేయుచున్నది. దేవుడు తన జ్ఞానమును తెలుపుటకు కొన్ని వేల సంవత్సరము లకు ఒకమారు భూమివిూదకు భగవంతుని రూపములో వచ్చుచున్నాడు. భగవంతుడు ఒక్కడే భూమివిూద జ్ఞానమును చెప్పితే మనుషులు దానినే వినే అవకాశముండుట వలన అట్లుకాకుండ మాయ భూమివిూద తన జ్ఞానమును చెప్పు మనుషులకు అనేకమందికి భగవాన్‌ అని వారి పేరు చివర అంటించినది. అందువలన భూమివిూద ఎల్లకాలము ఎందరో భగవాన్‌లు తమ తమ మాయబోధలను చెప్పుచునే ఉందురు. ఎల్లపుడు భగవాన్‌ అనుపేరు కలవారు భూమివిూద ఉండగా వేల సంవత్సరములకు ఒకమారు వచ్చు భగవంతున్ని ఎవరు గుర్తించలేరు, అంతేకాక ఆయన జ్ఞానమును కూడ ప్రత్యేకముగా గుర్తించలేరు. అందువలన భూమివిూద ప్రస్తుతమున్న జ్ఞానములలో, ఏది నిజమైన దైవజ్ఞానమో గుర్తించలేని పరిస్థితులలో మానవులున్నారు. ఈ విధముగా మాయ తన జ్ఞాన విధానమును మనుషుల మధ్యలో ఎందరో మనుషులనే గురువులుగా చలామణి చేస్తూ వారిద్వారా ప్రచారము చేయిస్తున్నది.