ఈ పుట ఆమోదించబడ్డది
అంబేద్కర్ పదవుల కోసం పాకులాడలేదు. బిరుదుల కోసం ఎగబడలేదు. చెయ్యిచాచి ఎవర్నీ అడగలేదు. అలాగే ఎంత పైకి వెళ్ళినా తన తోటివారిని మరిచిపోనూలేదు. ఎన్ని కష్టాలు పడినా అలసిపోనూ లేదు.
ఆయన పోరాటం కొంత ఫలించింది. 'మేమూ మనుషులమే. మాకు రావల్సింది మాకివ్వండి' అని వెనకబడ్డ జాతులు ఈరోజు అడుగుతున్నాయి. నిలబడుతున్నాయి.
"తెలుసుకోండి. ఒకటిగా నిలబడండి. పోరాడండి" అని అంబేద్కర్ ఎప్పుడూ చెప్పేవాడు. కులాలు మతాలు లేని రాజ్యం రావాలని కలలు కనేవాడు.
ఇలా బడుగు జనానికి అంబేద్కర్ వెలుతురు లోకం చూపాడు. అందుకే ఆయన వాళ్ళ గుండెల్లో నిలిచిపోయాడు.
34