Jump to content

పుట:Manu Charitra.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

కథాప్రారంభము

వ.

అభ్యుదయపరంపరాభివృద్ధిగా నాయొనర్పన్ బూనిన స్వారో
చిషమనుసంభవం బనుమహాప్రబంధంబునకుఁ గథాక్రమం
బెట్టి దనిన జైమినిముని స్వాయంభువమనుకథాశ్రవణానంత
రంబున మీఁద నెవ్వండు మను వయ్యె నెఱింగింపుమనవుడుఁ
బక్షులు మార్కండేయుుడు క్రోష్టుకికిన్ జెప్పినప్రకారం
బున ని ట్లని చెప్పన్ దొడంగె.

48

టీ. అభ్యుదయపరంపరాభివృద్ధిగాన్ = శ్రేయఃపరంపర కభివృద్ధియగునట్లు, నాయొనర్పన్ బూనిన = నేను రచింపఁదొడఁగిన, మహాప్రబంధమునకున్ = సమస్తవర్ణనావృతమగు మహాకావ్యమునకు, కథాక్రమము = కథయొక్క వరుస, ఎట్టిదనినన్ = ఏవిధముగా నుండునన, జైమినిముని = జైమినియను ఋషీశ్వరుఁడు, స్వాయంభువ...రంబు - స్వాయంభువమను(వుయొక్క), కథా = కథయొక్క, శ్రవణానంకరంబునన్ = వినుట యైనపిదప, ఎవ్వండు మను = ఏమహామహుఁడు మను వయ్యెనో, ఎఱిఁగింపుము. అనవుడు = అని యడుగఁగా, పక్షులు = ధర్మపక్షులు, మార్కండేయమహాముని, చెప్పినప్రకారంబునన్, ఇట్లని, చెప్పందొడంగెన్ = చెప్పుటకు మొదలుపెట్టెను.

మ.

వరణాద్వీపవతీతటాంచలమునన్ వప్రస్థలీచుంబితాం
బరమై సౌధసుధాప్రభాధవళితప్రాలేయరుఙ్మండలీ
హరిణంబై యరుణాస్పదం బనఁగ నార్యావర్తదేశంబునన్
బుర మొప్పున్ మహికంఠహారతరళస్ఫూర్తిన్ విడంబింపుచున్.

49