Jump to content

పుట:Manu Charitra.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ధూళి - తత్ = వానియొక్క, కర్ణ = చెవులనెడి, విస్తీర్ణ = పెద్దవియగు, తాలళవృంత = విసనకఱ్ఱలచేత, ఉద్ధూత = ఎగురఁగొట్టఁబడిన, ధూళి = పరాగము, శ్రమ...పంకంబు - శ్రమ = అలసటచే, బుర్పురత్ = బురబురమను, తురంగమ = గుఱ్ఱములయొక్క, నాసికా =ముక్కులనుండి, గళత్ = తొఱఁగు, పంకంబు = మలము, కర్దమము = బురుద, కుపిత...లనములు - కుపిత = కోపించిన, యోధ = వీరులచే, ఆక్షిప్త = చిమ్మఁబడిన, కుంతకాంతార = వెదురుపొదలవంటి యీఁటెలయొక్క, ఖేలనములు = విహారములు, దండఘట్టనలు = కఱ్ఱలదెబ్బలు, చెనఁటి...చిచ్చులు - చెనఁటి = దుర్గార్గులైన, పగఱ = శత్రులయొక్క, ప్రతాపంబు చిచ్చులు = పరాక్రమ మనునిప్పులను, ఆర్చుకరణిన్ = చల్లార్చునట్లు, గడిదేశములన్ = సరిహద్దుదేశములను, అలఁచున్ = కలఁతపెట్టును.

గడి యన సరిహ ద్దనుటకు —

క. "పరగును సీమావాహిని, విరజ యనఁగ నచట నొకటి విమలామృతని
    ర్భరపూర యగుచు నది గడి, పరమపదమునకు భవప్రపంచంబునకున్.”

(పరమయోగివిలాసము. ఆ 1)

కృష్ణదేవరాయలధాటి ప్రబలము భయంకరము గానఁ జెనఁటిపగతురప్రతాపవహ్ని నార్చుటయు భయంకరక్రియగాఁ జెప్పఁబడెను. రాయలు విజయయాత్ర లందు గజసైన్యము ఆశ్వికసైన్యము కాల్బంట్లు విజయార్థమై పాటుపడుచుండిరని భావము.

తా. శ్రీకృష్ణరాయలు దాడి వెడలినప్పు డేన్గులు తుండములతోఁ జిమ్ము తుంపురులును, నవి చెవులు వీచుకొనుటచే రేఁగెడు దుమ్మను, గుఱ్ఱములముక్కులనుండి జాఱుమలమును, భటులు ప్రయోగించు నీఁటెలదెబ్బలును, నాతనిశత్రురాజులప్రతాపాగ్నిని జల్లార్చుటకుఁ బైఁజల్లునీరుగను, జేటలతో గుప్పుమన్నుగను, పైఁగప్పు బురుదగను, నవ్వల ధట్టించుకఱ్ఱదెబ్బలుగను నయ్యెను.

అలం. ఉత్ప్రేక్ష, రూపకము.