గండ్లు మట్టితోఁ బూడ్చుచున్నటుల భూకాంతగంట్లు కస్తూరికాద్యాలేపములతో రాయలు నివారించెనని భావము. రాయల మైపూఁత సాంద్రము, పంకమువంటిదిగాననే భూకాంతమేను నున్న నయ్యెను.
తా. అంతవఱకును ఎడతెగక భరించుచున్న యాదివరాహమూర్తియొక్క కోఱ, ఆదిశేషునిపడగలమీఁదిఱాళ్లు, కులపర్వతశిఖరములమీఁదిశిలలు, ఒరసి గం ట్లేర్పడి రూపు చెడియున్న భూదేవి, నాకృష్ణరాయఁడు తనభుజముననే తాల్చుటచే నచటఁ బూయఁబడిన సుగంధిచందనము చిక్కగ నంటి గంట్లు పూడి యాభూదేవి సవర నయ్యెను. భూమి నాతఁడు నిర్బాధముగాఁ బరిపాలించె ననుట.
అలం. అతిశయోక్తి.
| ఉ. | క్రూరవనేభదంతహతకుడ్యపరిచ్యుతవజ్రపంక్తిఁ బొ | 36 |
టీ. కృష్ణ... ణంబులన్ - కృష్ణరాయఁ (డనెడు), మహికాంతుని = రాజుయొక్క, శాత్రవపట్టణంబులతోన్ = శత్రుపురములందు, క్రూర...పంక్తిన్ - క్రూర = కఠినములయిన, వనేభదంత = అడవియేనుఁగులకొమ్ములచే, హత = కొట్టఁబడిన, కుడ్య = గోడలనుండి, పరిచ్యుత = రాలిన, వజ్రపంక్తి = వజ్రములప్రోవును, పొల్పారు = ఒప్పునట్టి, మిడుంగుఱుంబురువులు = మిణుఁగుఱుఁబురుగులు, వెసన్ = శీఘ్రముగా, శృంగారవనద్రుమాళిన్ = ఉద్యానవనములందలి చెట్లయందు, గిజిగాఁడులు = బంగారుపిచ్చుకలు, దీపికల్ గాన్ = దీపములుగా, రహిన్ = ఆసక్తితో, చేర్చున్ = పెట్టును. (గిజిగాండ్లు గూండ్లలో వెలుతురుంటకు మెఱుఁగుడుపుర్వులఁ గొనిపోయి పెట్టుకొను ననుట ప్రసిద్ధము.)
రాజులు భోగపురుషులుగాన గోడలకు రత్నములు చెక్కిరి. మిగులదృఢమైన వైనను దుష్టములగు వనగజములకోఱపోటున కవి రాలినవి. శాత్రవ