Jump to content

పుట:Manu Charitra.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


జానికి నాయువు తనయుం
డై నెగడె నతండు గనె యయాతినరేంద్రున్.

20

టీ. వానికిన్ = ఆబుధునకు, ప్రజ్ఞానిధి = బుద్ధికి గనివంటివాఁడును, సింహసదృశుఁడు= (పరాక్రమమునందు) సింహముతో సమానుఁ డగు, పురూరవుఁడు, ఉదయించెన్ = జనించెను. తద్భూజానికిన్ = ఆరాజునకు, ఆయువనువాఁడు, తనయుండై = కొమారుఁడై, నెగడెన్ = అతిశయించెను. అతఁడు = ఆయువు, యయాతినరేంద్రున్ = యయాతిమహారాజును, కనెన్ = కనియెను.

వ్యాకరణము. భూజాని యన్నపుడు భూమియే జాయగాఁ (భార్యగాఁ) గలవాఁడని యర్థము. బహువ్రీహిని జాయాశబ్దంబు జానియగు (బాలవ్యా.)

తా. బుధునకుఁ బురూరవుఁడు నాతనికి నాయువు నాతనికి యయాతి యనియు జనించిరి.

క.

అతనికి యదుతుర్వసు లను
సుతు లుద్భవ మొంది రహితసూదనులు గళా
న్వితమతులు వారిలో వి
శ్రుతకీర్తి వహించెఁ దుర్వసుఁడు గుణనిధి యై.

21

టీ. అతనికిన్, అహితసూదనులు = వైరులను బరిమార్చువారు, కళాన్వితమతులు = విద్యలతోఁ గూడినచిత్తము కలవారు, అయిన, యదుతుర్వసులు = యదుఁడు తుర్వసుఁడు, అను సుతులు = అనుకొమారులు, ఉద్భవమొందిరి = పుట్టిరి. వారిలోన్, తుర్వసుఁడు, గుణనిధియై = మంచిగొనముల కునికిపట్టయి, విశ్రుతకీర్తిన్ = ప్రఖ్యాతయశమును, వహించెన్ = పొందెను.

తే.

వానివంశంబు తుళువాన్వవాయ మయ్యె
నందుఁ బెక్కండ్రునృపు లుదయంబు నొంది
నిఖిలభువనప్రపూర్ణనిర్ణిద్రకీర్తి
నధికు లైరి తదీయాన్వయమునఁ బుట్టి.

22