Jump to content

పుట:Manu Charitra.pdf/383

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.⁠

తెలతెల వేగిన నగ్గిరి
జలజలఁ బ్రవహించుసెలలచప్పుళ్లు శిఖా
వలకులకలకేకాకల
కలములు గలతలపొలంబు గనుఁగొనువేడ్కన్.

⁠ 12

టీ. తెలతెల వేగినన్ = (పైనఁ జెప్పిన విధముగా రాత్రియంతయు నెడతెగక వాన కురిసి) పిమ్మటఁ దెల్లఁగాఁ దెల్లవాఱఁగానే, అగ్గిరిన్ = ఆపర్వతమున, జలజలన్ = జలజల మనుచు, ప్రవహించు సెలలచప్పుళ్లు - ప్రవహించు = పాఱుచున్న, సెలల = గిరినిర్ఘరములయొక్క, చప్పుళ్లు = నాదములు, శిఖావల...కలకలములు - శిఖావల = మయూరముల, కుల = సమూహములయొక్క, కల = అవ్యక్తమాధుర్యముగల, కేకా = ధ్వనుల (నెమిళ్లధ్వనికిఁ గేక యని పేరు), కలకలములు = కోలాహలనాదములును, కలతలపొలంబున్ = కలిగియున్న పర్వతముయొక్క నెత్తములను, కనుఁగొనువేడ్కన్ = దర్శించఁ బుట్టినసంతోషముతో, మీఁదిపద్యముతో నన్వయము.

సెలయేళ్లు ఎత్తగు ప్రదేశములనుండి ప్రవహించుచుంటనే మిగుల మ్రోఁత జనించెను. ఆమ్రోఁతను మేఘధ్వనిగా భావించి నెమిళ్లు కేకలు వేయుచు నానందవరవశమున నుండెను. సెలయేళ్లు నెమిళ్లు దర్శనీయములు.

నగరములందును గ్రామములందును వేఁకువజామునఁ గోళ్లు కూసినటుల నడవులయందు నెమిళ్లు వేసినంతన కూయుచుండును. వర్షము కురిసి వెలిసిననాఁటి వేఁకువజామున నెమిళ్లు మిక్కుటముగా నఱచును.

తా. తెల్లవాఱినంతట నామందరపర్వతముపైఁ బ్రవహించు సెలయేళ్లును, నాదము చేయుచున్న నెమిళ్లగుంపులును గల కొండనెత్తమ్ములం జూడఁ దలఁచి.

ఆ.⁠

అన్నగాగ్ర మెక్కి యం దొక్కశశికాంత
వేదిఁ గతిపయాప్తవేష్టితుండుఁ

⁠