Jump to content

పుట:Manu Charitra.pdf/382

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

టీ. అతఁడు = ఆస్వరోచి, మఱి = మఱియును, మంథక్షితిభృత్తటిన్ = మందరపర్వతపు చఱియయందు, విశ్వకర్మ = దేవతల శిల్పకారుఁడు, చేసిన నగరిన్ = (అపూర్వరీతిగా) నిర్మాణముచేసిన పట్టణమునందు, వితతాటవికచమూసేవితుఁడై - వితత = విస్తారమైన, ఆటవిక = అడవిజాతివారలయొక్క, చమూ = సైన్యముచేత, సేవితుఁడు ఐ= సేవింపఁబడువాఁడై, సామ్రాజ్యము = ప్రభుత్వసంపదను, అనుభవింపన్ = అనుభవించుచుండ, ఒకతఱిన్ = ఒక్కసమయమున.

తా. స్వరోచి విశ్వకర్మ నిర్మించిన మందరాద్రితటమునం గల నగరమున బహుకిరాతసమూహము కొల్చుచుండ సామ్రాజ్య మనుభవించుచుండ నొక్కనాఁడు; ముందు పద్యముతో నన్వయము.

క.

కరకాచిటపటరవభీ
కరమై పెళపెళనినాదఘన మై ఝంఝా
మరుదుజ్ఝితబిలమంద్ర
స్వర మై యక్కొండ నొక్కవర్షము గురిసెన్.

11

టీ. అక్కొండన్ = ఆనగముపై, శరకాచిటపటరవభీకరమై = వడగండ్ల చిటపటధ్వనిచే భయముం బుట్టించునదియై, పెళపెళనినాదఘనమై = పెళపెళయను చప్పడులతో గర్జించు మబ్బులం గలది యగుచు, ఝంఝా...స్వరమై - ఝంఝామరుత్ = వర్షయుక్త మగు వాయువుచే, ఊజ్ఝిత = విడువఁబడిన, బిల = కొండగవుల, మంద్రస్వరమై = పెద్దశబ్దము గలిగినదియై, గంభీరధ్వని గలదై (మంద్రస్తు గంభీరః - అమ.) ఒక్కవర్షము = ఒకవాన, కురిసెన్ = వర్షించెను.

తా. ఆకొండపై వడగండ్లు రాలుచుండఁగాఁ, బెళపెళ మొగు ళ్లుఱుముచుండఁగా, గాలివలన గుహలు ధ్వని చేయుచుండఁగా, వర్షము గురిసెను.

అలం. స్వభావోక్తి.