Jump to content

పుట:Manu Charitra.pdf/381

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

వేదండముతొండముసరి
కోదండముఁ దివియు నెడమఁ గుడి నిబిడజ్యా
నాదము రోదసి నిండఁగ
భేదించున్ గండశిలలఁ బృథుబాణములన్.

9

టీ. వేదండము తొండము సరి కోదండమున్ = ఏనుఁగుతొండముతో సరియైరధనుస్సును, ఎడమన్ = ఎడమవైపునను, కుడి = కుడివైపునను, నిబిడజ్యానాదము = దట్టమైన గుణధ్వని, రోదసిన్ = భూమ్యాకాశమధ్యమున, నిండఁగన్ = పూర్ణ మగురీతిని, తివియున్ = లాగును. గండశిలలన్ = పెద్దగుండుఱాళ్లను, పృథుబాణములన్ = పెద్దబాణములచే, భేదించున్ = బ్రద్దలుగొట్టును.

భూమ్యాకాశముల మధ్యభాగము నిండునది గాన నారిమ్రోఁత నిబిడము. సామాన్యబాణములైన శిలల భేదించవు. శిలలు గండశిలలు, బాణములు మిగుల గొప్పవి. కాననే విల్లును ఏన్గుతొండములావున నుంట; అతిశయము ఎడమ కుడి సమముగా నేయుట.

తా. ఏనుఁగుతొండమువంటి లావగువింటి నెక్కిడి, భూమియు నాకసము నిండునట్లు నారి సారించుచు గొప్పగొప్పబాణములతో నెడమచేతితోను గుడిచేతితోను గండశిలలను భేదించుచుండెను.

అలం. ఉపమాతిశయోక్త్యలంకారములు.

క.

అతఁడు మఱి తనకుఁ మంథ
క్షితిభృత్తటి విశ్వశర్మ చేసిననగరిన్
వితతాటవికచమూసే
వితుఁడై సామ్రాజ్య మనుభవింప నొకతఱిన్.

10