Jump to content

పుట:Manu Charitra.pdf/336

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వ్రతము = ఇఁకమీఁద నిది కోర నని యేర్పఱచికొన్న కట్టుపాటు, విడిచితిన్ = ఇపుడె విడనాడితిని. పరులకున్ = ఇతరులకు, మేలైనన్ = మంచి కలిగినను, చాలున్ = అంతియ చాలును. శరీరంబైనన్ = ఈదేహమునైనను, ఉపేక్షింపవలయున్ = విడిచిపెట్టవలయును. అది = ఆవిషయము, అట్లుండెన్ = అట్లుండఁగా.

తా. నాస్థితి యిటు లున్నను దానినిగూర్చి నే నించుకేనియు సంకోచింపఁబోను. నీ వింతగా దైన్యపడి యడుగుచున్నావు గావున నానియమమును విడనాడితిని. శరీరము విడిచి యైనను నితరులకు మేలు చేయవలయు. ఆవిషయ మట్లుండనీ.

అలం. అప్రస్తుతప్రశంస, కావ్యార్థాపత్తియును.

క.⁠

తివురక యిం కొక్కటి విను
కవయునెడన్ వలయుఁ గన్నుఁగవయును మూయన్
భువి నిది యస్మద్దేశ
వ్యవహారము కన్నుఁ దెఱవ నఘ మగుఁ దెఱవా.

⁠ 101

టీ. తెఱవా = ఉవిదా! తివురక = తొందరపడక, ఇం కొక్కటి వినుము = ఇంక నొకసంగతిని దెలిపెద నాలకింపుము. కవయునెడన్ = కలయిక చెందునప్పుడు, కన్నుఁగవయున్ = నేత్రద్వయమును, మూయన్ = మూసికొనుట, వలయున్ = ఆవశ్యకము, భువిన్ = భూమియందు, కన్ను దెఱవన్ = కన్నులను దెఱచుటచేత, అఘమగున్ = పాపము కలుగును. ఇది = సంభోగసమయమునందుఁ గన్ను మూసికొనుట, అస్మద్దేశవ్యవహారము = మాదేశాచారము.

నిజముగా దోస మేని మా కీయాచార మేల యాచరణమునందు లేకపోయె నని వరూథిని యనునేమో యనిమాయాప్రవరుఁడు అస్మద్దేశవ్యవహార మనెను. అఘ మనుటచేఁ బాపమునకు వెఱచి యటులఁ జేయకుండు ననియుఁ దనగుట్టు మరుగుచెడ కుండు ననియును.