ఒక్కవేళన్ = ఒకానొకసమయమున, పెన్మక్కువన్ = పెద్దయపేక్షతో, ఆదరింతురు, జవరాండ్రచిత్తముల్ = యువతులడెందములు, క్షణక్షణముల్ = ప్రతిక్షణమునకు మారునవి, (కాన) పక్కునన్ = తటాలున, వేసరన్ చనదు = విసువరాదు. ఉపాయములు = బహువిధములగు నుపాయములచేతను, తగునిచ్చకంబులన్ = అనువైన యిచ్చకాలతోడను, చిక్కఁగఁజేసి = స్వాధీనపఱుచుకొని, డాసి = డగ్గఱి, సతిచిత్తముఁ బట్టి = ఆఁడుదానిమనసు ననువర్తించి, సుఖింపఁగాఁ దగున్ = సంభోగసౌఖ్యముల ననుభవింపఁగాఁ దగును.
స్త్రీలచిత్తములు క్షణక్షణము చలించునవిగానఁ గాలానుసారములగు ప్రయత్నములు చేయవలయు ననుటకు —
ఉ. “ఇప్పటి నీతలంచు తెఱఁ గిట్టిదయౌ నిటమీఁద నెప్పు డే
చొప్పున నుండునో! నిజముసుద్ది యెఱుంగము గాని యుగ్మలీ
చెప్పెడిదేమి! బాలికలచిత్తము లంబుతరంగలోలముల్.”
(శృంగారనైషధము. ఆ. 2)
తా. ఒక్కొకప్పుడు తిరస్కరింతురు. ఇంకొకప్పుడు మిక్కిలి మక్కువ చూపుదురు. స్త్రీలచిత్తములు చపలము లగునవి కావునఁ దటాలున విసివి విడువరాదు. ఉపాయములు చేసి యనువయిన యిచ్చకములు పలికి స్వాధీనపఱుచుకొని డగ్గఱి యాఁడుదానిమనసు గుర్తెఱిఁగి సుఖింప నగును.
అలం. అప్రస్తుతప్రశంస, కావ్యలింగమును.
| క. | అని తలఁచి యవ్విలాసిని | 70 |