Jump to content

పుట:Manu Charitra.pdf/284

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

డగుచున్ = కట్టఁబడినవాఁ డగుచు, తోడి = తనతోడి దగు, బలఁగము = ఆత్మజనము, ఐనట్టిచుక్కల = ఐననక్షత్రములయొక్క, వలసత్రోవన్ = విప్లవమునకు వెఱచి ప్రాణార్తులై యితరదేశములకు బ్రదుకఁబోవు త్రోవను, చూపన్ = చూపించుటకు, ఏతెంచెనో యనన్ = వచ్చెనేమో యనునటుల, వేగుఁజుక్క = తెల్లవారుచుక్క (శుక్రుఁడు), పొడిచెన్ = ఉదయించెను.

అలం. ఉత్ప్రేక్షారూపకాలంకారములు.

మ.

సకలాశాగతినర్మకోపవిరతిశ్రౌతక్రియారంభణా
త్మకవర్గత్రయికిన్ మదుచ్ఛరితశబ్దజ్ఞానమే మూలమిం
తకుఁ బోలన్ వినుఁ డంచుఁ దెల్పుగతిఁ జెంతన్ గొండపై పల్లెలన్
గృకవాకుల్ మొరసె గృహోపరిఁ ద్రిభంగిన్ భుగ్నకంఠధ్వనిన్.

55

టీ. సక...త్రయికిన్ = సకలాశాగతి = (పనిపాటులకు జనులు) ఎల్లదిక్కులకుఁ బోవుట —జనులు స్వకార్యములు నిర్వర్తించుకొనుటకు నెవరిదారిని వారలు యథేచ్ఛముగాఁ బోవుట. నర్మకోపవిరతి = ప్రణయకోపముయొక్క చల్లారుట, స్త్రీపురుషులు పొలయలుకను మానుకొని రతులకు దొరకొనుట, శ్రౌతక్రియారంభణ = వేదచోదితములైనకర్మలఁ జఱుప నారంభించుట — వేదవిహితములగు స్నానసంధ్యాద్యనుష్ఠానములు వేళ దాటనీయక నెఱువేర్చుట, ఆత్మక = (అనునీ)రూపమైన, వర్గత్రయికిన్ = త్రివర్గమునకు, (అర్థ, కామ, ధర్మ పురుషార్థములందుఁ బ్రవృత్తికి), మదుచ్చరితశబ్దజ్ఞానమే = నాచేఁ బలుకఁబడిన పలుకుయొక్క యెఱుకయే — ధ్వని వినుటచేఁ గలిగిన మెలఁకువయే, మూలము = ఆధారము, ఇంతకున్ = ఈవిషయమునకు, పోలన్ = సరిగా, వినుఁడు = (లోకులారా) ఆలకింపుఁడు, అంచున్ = అని, తెల్పుగతిన్ = తెలియఁజేయువిధముగా, చెంతన్ = సమీపమునందున్న, కొండపై పల్లెలన్ = కొండమీఁదిపల్లెలలో, గృహోపరి = ఇండ్లమీఁద, కృకవా