మనువెన్నెల, డొంకి = తగ్గి, వాడుటన్ = వాడిపోవుటచేత, తేట = ప్రసన్నత, తొఱంగి = మాసి, విన్ననగు = చిన్నవోయిన, నీమొగమో అనన్ = నీముఖమేమొ యనునటుల - నీముఖమువలె, మాసి = కాంతితగ్గి, భానురుచిన్ = సూర్యకాంతిచే, తనకందు = తనకళంకము, మీఱఁగన్ = హెచ్చఁగా, అదె వ్రాలెన్ = అస్తమించెను.
కురులు మోమునందు జారిన వరూథినిముఖము కళంకముతో నున్నచంద్రబింబమును బోలియుండెను. ఆచంద్రుఁడు భానురుచిచేఁ గాంతిమాసినచంద్రుఁడు. వరూథినిమోమునఁ జిఱునవ్వును గాంతిలేమిచే నదియుఁ గాంతి కోలుపోయిన చంద్రునివలె నున్నది. అద్దపుబిళ్లవలెఁ జంద్రుఁడు గానవచ్చునటులు వరూథినిముఖము మంచిగంద మంటఁగట్టిన పాపటబొట్టువలె నున్నదని భావము.
తా. ఓపాటలగంధీ! చిక్కులు దీర్చి దువ్వి చక్కపఱుపకపోవుటచేఁ జెదరి నీవెండ్రుకలు క్రమ్ముకొని మంచిగంద మంటి యట్టవలెఁ గట్టి పాపటబొట్టుచందమునఁ గానరాఁగా చిఱునగవుపొలుపు తగ్గి, వాడి చిన్నవోయియున్న నీమొగమో యనునట్లు సూర్యునివెలుఁగుచేఁ దనకాంతి మాసి కళంక మెక్కువ కాఁగాఁ జంద్రుఁడు అస్తమించెను.
అలం. ఉత్ప్రేక్షాలంకారము.
| సీ. | సకుటుంబముగ వీఁగి చరమశైలముఁ జేరు | |