Jump to content

పుట:Manu Charitra.pdf/276

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దైవము = దేవుఁడు, దోసకారులకే = పాపపుఁబను లొనర్చువారికే, ఎప్పట్టునన్ = ఎప్పుడును, తోడై వచ్చున్ = సాయమై వచ్చును. ఆహా = ఇది యాశ్చర్యము.

మన్మథుఁడు ఇంద్రుఁడు మొదలగువారిప్రేరణచేతనేగాక యహంకారముచేతఁ గూడ శివునిపైకి విజృంభించెను. మన్మథుఁడు సాహంకారి యనుట కతనివాక్యములు.

శ్లో. "ప్రసీద విశ్రామ్యతు వీర వజ్రం శరైర్మదీయైః కతమః సురారిః,
    బిభేతు మోఘీకృత బాహువీర్యః స్త్రీభ్యో౽సి కోపస్ఫురితాధరాభ్యః.
శ్లో. తవ ప్రసాదాత్ కుసుమాయుధో౽పి సహాయ మేకం మధు మేవలబ్ధ్వా,
    కుర్యాం హరస్యాపి పినాకపాణేః ధైర్యచ్యుతిం కేమమధన్వినో౽న్యే.”

(కుమార సం. తృ. స.)

తా. మన్మథా! ఎదిరి నెఱుఁగక వర్తించు నీగర్వమునకు శంకరుం డాగ్రహించి నీపైకి నేత్రాగ్నిని బ్రయోగింపఁగా నాయగ్నిహోత్రుఁడు స్వాహాకాముకుఁ డౌటచే మొగ మోడి నిన్నుఁ జంపఁ డయ్యెను. కానిచో నీవు తిరిగియు దేహముతో నుండు టెట్లు? ఆహా! దైవము సైతము పాపాత్ములకే తో డగుచుండును గదా?

అలం. అర్థాంతరన్యాసాలంకారము.

చ.

జడ నొకయింతలేని నెఱచక్కఁదనంబుల నెల్లఁ గూర్పఁగాఁ
బొడ వయినట్టి ధన్యుఁడవు భోగివి పూవిలుకాఁడ విట్టి నీ
వెడపక నిష్ఠురత్వమున కె ట్లలవాటుగఁ జేసి తక్కటా!
పడఁతులమీఁద నేయ రతిపయ్యెదకున్ ననువైన చేతులన్.

48

టీ. జడను = మాంద్యము, ఒకయింత = ఇంచుకైనను, లేని, నెఱచక్కఁదనంబులనెల్లన్ = నిండుసౌందర్యములనన్నిటిని, కూర్పఁగాన్ = రాశి చేయఁగా, పొడవు = ఆకారముగా, అయినట్టి ధన్యుఁడవు = ఏర్పడిన కృతార్థుఁడవు. మిగులఁ జక్కఁదనము గలిగి లోకోత్తరుఁడవై వర్తించువాఁడవు,