కొన్నిదినములు, (నీగుణ మెఱుంగరానియంతవఱకు) ఇడి = ఉంచుకొని, చూచి, కళంకివి = కళంకము గలవాఁడవు — అపవాదము గలవాఁడవు, అగుట = ఐయుండుట, ఎఱిఁగి = తెలిసికొని, ఉడుకుచున్ = కోపించుచు, దక్షాధ్వరమునన్ = దక్షునియజ్ఞమున, అడుగునున్ = కాలిక్రింద, (వీరభద్రాకృతి గలవాఁడై), పడవైచెన్ = పడవైచి త్రొక్కెను. దానన్ = ఆకాలిక్రిందఁ బడి చెందిన నలుగుడుచేనైనను, అడఁగవు = నశింపవైతివి, చచ్చినవాఁడవు కాకపోతివి!
తా. చంద్రా! శివుఁడు నిన్నుఁ గొన్నాళ్లు తలపైఁ దాల్చి చూచి నీకళంకము నెఱిఁగి దక్షయజ్ఞమున వీరభద్రమూర్తియై కాలిక్రింద నలుగఁద్రొక్కెను. అప్పుడును జావవైతివి గదరా!
అలం. విశేషోక్త్యలంకారము.
| క. | గాండీవము నీచేతిది | 44 |
టీ. నిశాచరరాత్రులయందుఁ జరించు నోరాక్షసుఁడా! చంద్రుఁడా! నీ చేతిది = నీచేతిలో నుండెడిది, గాండీవము = గాండీవ మనువిల్లు, పాండవునిన్ = అర్జునుని, చేరఁబట్టి = చేరుటచేతనే, బ్రతికితిమి = జీవించియున్నారము, ఆవిల్లు = ఆగాండీవధనుస్సు, ఉండినన్ = (నీచేతనే) ఉన్నయెడల, నేఁడు = ఈదినము - ఇప్పుడు, ఈవిరహావస్థయందు, అల్లునికిన్ = మేనల్లుఁడగు మన్మథునికి, తోడు = సహాయముగా, శితభల్లములన్ = వాఁడిములుకులచే, చెండవె = ఖండింపక యూరకుందువా? ఖండించితీరెదవు.
పూలములఁకులతోడను జెఱకువింటితోడను నీయల్లుఁడే ప్రాణములు తీయుచుండ నంతకు గొప్పవాఁడవును మామ వగునీవు గాండీవమె యున్నచో వాఁడిబాణము లేయుటలో నాశ్చర్య మేమున్నది? నీవు నిశాచరుఁడవు గాన నెపుడో చంపెడివాఁడవు.