అనునట్లు, కదలీకదలక వ్యాకరణదుష్టమని యిటీవల ముద్రణములలోఁ గదలెంగదలవు అని మార్పఁబడెను. కదలీకదలక లోనగుచోటులఁ గ్త్వార్థకయిత్తులకు దీర్ఘముగూడఁ బ్రాచీనప్రయోగములందుఁ గలదు. కాన నిది గ్రాహ్య మని మాతలంపు. ప్రాచీనగ్రంథములం దిట్టిప్రయోగములు గలవు.
క. “నమ్మమి మృత్యువు పెద్దయు, నమ్ముట యపమృత్యు వగుట నరపతి నమ్మీ
నమ్మక పనులను గొని ని, త్యమ్మును సూక్ష్మమతి దాని నరయఁగ వలయున్.”
(భారతము, శాంతి. ద్వి. ఆ. 351 ప.)
నూతనముద్రణమునందు "నరపతిమిత్రున్, నమ్మి పనులు గొనునది” అని మార్పఁబడింది. ఇది సాహసము. “కూడీకూడని చిన్నకూకటులతో గోపార్భకశ్రేణితో" దేవకీనందనశతకము. కదలు..ద్రోణికలన్ - కదలు, ఉపవన = ఉద్యానములందలి, కదళీ = అరఁటిచెట్లయొక్కయు, కేతకీ = మొగిలిచెట్లయొక్కయు, హింతాళ = హింతాళవృక్షములయొక్కయు, నారికేళ = కొబ్బరిచెట్లయొక్కయు, పూగ = పోఁకచెట్లయొక్కయు, ఆవళి = వరుసలయొక్క, కోమల = మృదువులైన, పలాశద్రోణికలన్ = ఆకుదొన్నెలయందు, నునుపు = నున్నన, కలపొరలయోరలన్ = కలిగినయావరణలప్రక్కలందు, శరధితరఁగలమీఁదనుంబోలె = సముద్రపుతరంగములమీఁదనువలె, గిఱికొని = వ్యాపించి (మందమారుతము సోఁక కదలీకదలనట్లున్న యయ్యైవృక్షములకొన యాకులపైఁ బడుచో సముద్రతరంగములపైఁ బడిన ట్లుండె ననుట.) అలం. ఉపమ. ఎల్లవల్లికలు = అన్నితీవలును, పూవక = పుష్పింపకయే, పూచినట్లు, ఉల్లసిల్లన్ = రంజిల్లఁగా, ఱెల్లు = ఱెల్లుగడ్డి, ఉల్లసిల్లినచందంబునన్ = విరియఁబూచినవిధమున, తెల్లతెల్లనై, మొల్లమిగన్ = దట్టముగా, అంతకంతకున్, దిగంతంబులు = దిక్కులకొనలు, దంతంబులు = ఏన్గుదంతములును, తీరిచినయిడుపులుబోలెన్ = తీర్చిన పార్శ్వభాగములవలె, తీండ్రింపన్ = ప్రకాశింపఁగా, రేయెడ = రాత్రివేళయెండ (రేయెండపదమునకు వెన్నెల యనునర్థము నింతకుఁ బ్రాచీనకావ్యములందు మృగ్యము. రేయెండ