Jump to content

పుట:Manu Charitra.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంగీతశాస్త్రమునందుఁ ప్రబంధలక్షణము.

శ్లో. “చతుర్భిద్ధాతుభిష్షడ్భిశ్చాంగైర్యస్మాత్ప్రయుజ్యతే,
      తస్మాత్ ప్రబంధః కథితః.”

—సంగీతచూడామణి

తా. చందిరకావిపావడఁ దొడిగి విరివి యైనపిఱుఁదులు నిండారునట్లు పలుచని తెల్లసెల్లా చుట్టి పైఁటగాఁ బొదిగిన దగుటచే లోనిపావడరంగు సెల్లాపైకిఁ దోఁచుచుఁ జంద్రకాంతమణులు తాఁపినపీఁటసైత మెఱుపుదేఱుచుండెను. వీణకు నమర్చినసొరకాయలు, ఎత్తయిన చనుపట్టున నొఱగియుండెను. నునువ్రేళ్లతోఁ గదల్పఁబడుతీఁగలధ్వనితో సన్నని తనగాత్రపుఁబాట ముద్దులు గొలుపుచుండెను. రాగము నాలపించునప్పు డరమొగిడి కన్నుదోయి సురతమునందలి మైమఱుపును దెలుపుచుండెను. వీణపైఁ బలికించుకృతులకుఁ దనకరకంకణములచప్పుడు తాళము లిడుచున్న ట్లుండెను. ఈవిధమున హొయలు మెఱయ వీణ వాయించుచు.

అలం. తద్గుణనిదర్శనారూపకములు.

ఉ.

అబ్బురపాటుతోడ నయనాంబుజముల్ వికసింపఁ గాంతి పె
ల్లుబ్బి కనీనికల్ వికసితోత్పలపంక్తులఁ గ్రుమ్మరింపఁగా
గుబ్బ మెఱుంగుఁజన్గవ గగుర్పొడువన్ మదిలోనఁ గోరికల్
గుబ్బతిలంగఁ జూచె నలకూబరసన్నిభు నద్ధరామరున్.

28

టీ. అబ్బురపాటుతోడన్ = అబ్బురపడుటతో, నయనాంబుజముల్ = కన్నుదమ్ములు, వికసింపన్ = విరఁబాఱఁగా, కాంతి = ప్రకాశము, పెల్లుబ్బి = మిక్కిలి మెండై, కనీనికల్ = కంటిలోని నల్లనిగ్రుడ్లు, వికసితోత్పలపంక్తులన్ = విచ్ఛినకలువపూదండలను, క్రుమ్మరింపఁగాన్ = ఉప్పతిలఁజేయఁగా, గుబ్బ...గవ - గుబ్బ = గుండ్రనై, మెఱుంగు = మిసమిసలుగల, చన్గవ = స్తనద్వయము, గగుర్పొడువన్ = పులకింపఁగా, మదిలోనన్ = మనస్సున, కోరికల్, గుబ్బతిలంగన్ = పెల్లు మీఱఁగా, నలకూబరసన్నిభున్ = నలకూబరునితో సమానుడగు, అద్ధరామరున్ = ఆబ్రాహ్మణుని, చూచెన్ = కాంచెను.