పాలిండ్ల నొరయుట సాజము. దీనిచే గుబ్బలవ్రేగు ఉబ్బువిస్తృతి సూచితము. “శ్లో. సమున్నతఘనస్తనస్తబకచుంబితుంభీఫలక్వణన్మధురవీణయవిబుధలోకలోలభ్రువా త్వదీయ ముపగీయతే.”చూ.ప్ర. 5. ప. ప్రసన్నరాఘవము. తరుణా...స్వనంబుతోన్ - తరుణాంగుళీ = లేఁతవ్రేళ్లచేత, ధూత = కదల్పఁబడిన, తంత్రీ = తంతులయొక్క, స్వనంబుతోన్ = ధ్వనితో, జిలిబిలిపాట = సన్ననిపాట, ముద్దులు = పొలుపును, నటింపన్ = కలిగింపఁగా, ఆలాపగతి = రాగము నాలపించురీతిచే, అరమోడ్పుఁగనుదోయి = సగము మూఁతపడుటగలకన్నులు, రతిపారవశ్యవిభ్రమము = సురతమునందలి మైమఱుపాటుపొల్పును, తెలుపన్ = ఎఱుఁగఁజేయఁగా, ప్రౌఢిన్ = నేర్పుతో, పలికించు గీతప్రబంధములకున్ = (వీణపైఁ) బలుకఁజేయు సంగీతరచనలకు, కమ్ర...స్ఫూర్తి - కమ్ర=మనోహరమైన, కరపంకరుహ - హస్తవద్మములందలి, రత్నకటక = రతనములు తాఁపిన కడియములయొక్క, ఝణఝణధ్వనిస్ఫూర్తి = ఝణఝణ మనుధ్వని కలుగుట, తాళమానములు = తాళముయొక్క నియమములను, కొలువన్ = కలిగించుచుండఁగాను, ఇంపు = హొయలు, తళుకొత్తన్ = మీఱఁగా, వీణవాయింపుచుండి (పైపద్యముతో నన్వయము.)
రతి పారవశ్యమునందుఁ గన్ను లఱమోడ్పు గొను ననుటకు దృష్టాంతము.
—కళాశాస్త్రము
పాళి యనఁ బ్రదేశ మనుటకు —
“పాళిః కర్ణలతాగ్రే చ ప్రదేశాంకాశ్రిపంక్తిషు
త్సరుచ్ఛదేచయూకాయాం సంజాతశ్మశ్రుయోషితి.”
—నానార్థరత్నమాల
కృదికారాదక్తినః - అనుసూత్రముచేఁ బాళీశబ్దమునకు దీర్ఘము గూడ వచ్చును.