Jump to content

పుట:Manu Charitra.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గలది, అని = అనుకొని, చేరఁబోయి = సమీపించి, విద్యుల్లతావిగ్రహన్ = మెఱపుఁదీగవంటి మేను గలదానిని, శతపత్రేక్షణన్ = కమలములవంటి కన్నులు గలదానిని, చంచరీకచికురన్ = తుమైదలవంటి కురులు గలదానిని, చంద్రాస్యన్ = చంద్రునిఁ బోలు మోము గలదానిని, చక్రస్తనిక్ = చక్రవాకములవంటి చన్నులు గలదానిని, నతనాభిన్ = లోఁతైన బొడ్డు గలదానిని, ఒకానొక, మరున్నారీశిరోరత్నమున్ = దేవతాస్త్రీలలో మిన్నయగు, నవలాన్ = జవరాలిని, కనియెన్.

వీచినది వాతము గాదు. వాతపరంపర. కాననే జనసమన్విత మని గ్రహింపఁ గలుగుట. వరూథిని వేల్పుచెలువ గాన ముఖాదిగాఁ గవి వర్ణించెను. పొక్కిలి లోఁతుగా నుండుటచే నుత్తమజాతిస్త్రీ యని సాముద్రికము. దేవకాంతామణి కావున నాకారము శుభలక్షణలక్షితమై యున్న దనుట.

నవలాపదము దీర్ఘాంతమగు దేశ్యము. నవలయను హ్రస్వాంతరూపము గూడఁ గలదు. హ్రస్వాంతము గల దనుటకు, క. "అన్నవలముద్దు మోమును” (విక్రమార్కచరిత్రము.)

తా. ఆప్రవరుఁ డాగాలిజాలును బట్టి యిచ్చోట జనులు గల రని తెలిసికొని చేర నరిగి మెఱుపుఁదీఁగవంటి మేను, కమలములవంటి కన్నులు, దుమ్మెదలవంటి కురులును, జందురునివంటి నెమ్మోమును, జక్కవలవంటి చన్నులును, లోఁతైన బొడ్డును గలయొకానొకవేల్పుజవరాలిని గన్గొనెను.

తే.

అమలమణిమయనిజమందిరాంగణస్థ
తరుణసహకారమూలవితర్దిమీఁద
శీతలానిల మొలయ నాసీన యైన
యన్నిలింపాబ్జముఖియు నయ్యవసరమున.

26

టీ. అమల...మీఁదన్ - అమలమణిమయ = నిర్మలములైన మణులతోఁ గూర్పఁబడిన, నిజ = తనయొక్క, మందిర = ఇంటియొక్క, అంగణస్థ = ముంగిట నున్న, తరుణసహకార = తీయమావిగున్నయొక్క, మూల = మొదట