Jump to content

పుట:Manu Charitra.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఐంది...గుళుచ్ఛంబులన్ - ఐందవగ్రావ = నెలఱాల(కంబముల)చేత, అకల్పిత = కూర్పఁబడిన, కాయమాన = మేల్కట్టు పందిటియందు, జటిల = అల్లుకొన్న, ద్రాక్షా = ద్రాక్షతీఁగలయందలి, గుళుచ్ఛంబులన్ = పండ్లగుత్తులచేతను, పూవుందీవెలన్ = పూఁదీగలచేతను, ఒప్పు = ఒప్పుచున్న, భవనంబు = ఇంటిని, గారుడోత్కీర్ణమున్ = గరుడపచ్చలచే పొదుగఁబడినదానిని, (దీనికిఁ బైక్రియతో నన్వయము.)

పూవుందీవెల ఆనుచో బిందుసిద్ధికి సూత్రము “సమానంబుల నుదంతంబు లగు స్త్రీసమంబులకుం బరుష సరళంబులు పరంబు లగునపుడు నుగాగమం బగు” ఇటులె, చిగురుంగైదువు, పూవుంబోఁడి.

తా. దిక్కులఁ బరిమళమును విదిర్చు చెంగలువలు గల వరిమడిదగ్గఱ, మామిళ్లు గోరంటలు పెనఁగొన్నతోఁపులో నెలఱాలికంబములతోఁ గట్టిన వందిలిపై దట్టముగాఁ బ్రాఁకి గెలలు వేసిన ద్రాక్షతీగలును బూవుదీగలును గల్గి యింపై గరుడపచ్చలు పొదుగఁబడిన యొకయిల్లును.

క.

కాంచి తదీయవిచిత్రో
దంచితసౌభాగ్యగరిమ కచ్చెరువడి య
క్కాంచనగర్భాన్వయమణి
యించుక దఱియంగ నచటి కేఁగెడువేళన్.

23

టీ. కాంచి = ఆ దివ్యభవనమును జూచి, తదీయ...గరిమకున్ - తదీయ = దానియొక్క, విచిత్ర = వింతయైన, ఉదంచిత = మిగుల బాగైన, సౌభాగ్యగరిమకు = చక్కఁదనపుఁ బెంపునకు, అచ్చెరువడి = ఆశ్చర్యపడి, అక్కాంచనగర్భాన్వయమణి = ఆబ్రాహ్మణవంశశ్రేష్ఠుడు (ప్రవరుఁడు), ఇంచుక = కొంచెము, తఱియంగన్ = సమీపింపఁగా, అచటికిన్ = ఆతావునకు, ఏఁగెడువేళన్ = పోవునప్పుడు, పైపద్యముతో నన్వయము. తొలుత నాశ్రమముగా నెంచెను. చక్కఁదనపుఁబెం పచ్చెరువు గూర్చి యాశ్రమము గాదేమొ యనుశంకను బలపఱచెను. చేయఁదోఁచక యించుక సమీపించెను.