గోళ్లయొక్క, భయద = భయముకలిగించునట్టి, మథన = చిదుముటలచే, (త్రచ్చుటచేత) శిథిల = తునిఁగిన, మధుకోశవిసర = తేనెతుట్టెలసమూహమునుండి, విశీర్ణ = రేఁగిన, మక్షికా = ఈఁగలయొక్క, అంతరాంతర = నడుమనడుమ, దంతురిత = దట్టమైన, ఆతపమునన్ = ఎండచేత, పుడమి = భూమి, తిలతండులన్యాయమునన్ = నువ్వులు బియ్యము కలసిన విధమున (ఎలుఁగుగొడ్లు తమగోళ్లతోఁ దేనెతుట్టెలను జిదుమఁగొట్టఁగా నీఁగలు రేఁగి తిరుగుచుండుటచే నెండలో వానిపొడ లేర్పడి నూవులు బియ్యము కలియఁబోసినట్టు నేల యుండె నని భావము.) వెలుంగన్ = ప్రకాశించుచుండ, మీదిపద్యములోని పరికించున్ అనుక్రియతో నన్వయము. అందుగుచివుళ్లు ఏనుఁగులకుఁ బ్రియ మగునాహారము,
శ్లో. "సీతాదేవ్యాస్స్వకరకలితైస్సల్లకీపల్లవాగ్రై
రగ్రే లోలః కరికలభకో యః పురా పోషితో౽భూత్.”
ఉత్తరరామచరిత్రము, అం. 3.
సల్లకీపల్లవ మన యందుగుచివురు.
ఎలుగుబంట్లగోళ్లు బలమైనవియం బల్లెములవలె వాఁడియుఁ బొడవును గలవి గావున నవి తేనెతెట్టెల పట్టి యొరయుట భయంకరముగ నుండె ననుట. తేనెటీఁగలకుఁ దేనెపెర కోశము (ధనరాశి), అది విరోధిస్వాధీన మగుటచే సురక్షితముగ బయటపడి వనమునంతటను దుమ్మెదలు గలయ నల్లుకొనెను. వానినీడ వెలుఁగు గలసి తిలతండులన్యాయమును భూమికిఁ జేకూర్చెను.
తా. ఏనుఁగు లందుగుచిగుళ్లకై నిక్కి తొండములు చాఁచునప్పుడు వానిదంతములకాంతు లతిశయించుచుండె ననియు, పెద్దపులులు నిద్రపోవుచుండఁగా వానిపెదవులమూలలఁ గాఱెడిజొల్లునకు నడవియీఁగలు ముసురుకొనుచుండె ననియు, పందులు సెలయేళ్లలోని యిసుకదిబ్బలం త్రవ్వి తుంగగడ్డలు పెల్లగించి తినుచుండె ననియు, ఋశ్యమృగములు బలిసిన యావుపెయ్యలవలె డొంకలయందు దుముకులాడుచు మెలఁగె ననియు, ఎలుఁగుగొడ్లు పుట్టలను గోళ్లతోఁ బెల్లగింపఁగా వానిలోఁ దెట్టెలు పెట్టియున్నతేనెటీఁగలు రేఁగి