Jump to content

పుట:Manu Charitra.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పావకోళ్లు, కలాచికా = తమ్మపడిగము, ముకుర = అద్దము, వీటికాకరండ = తాంబూలపుఁబెట్టె, ముఖ్య = మొదలగు, రాజలాంఛనా = రాజచిహ్నములు గలవాఁడా!

తా. కుకురుకాశాదిదేశములరాజుల నోడించి, కొనివచ్చినవారి కన్నెలు తమ్మపడిగము పావకోళ్లు మొదలగువానిని దాల్పఁగా రాజలాంఛనములతో నొప్పారువాఁడా!

గద్యము.

ఇది శ్రీమదాంధ్రకవితాపితామహసర్వతోముఖాంక
పంకజాక్షపాదాంబుజాధీనమానసేందిందిర నందవరపురవం
శోత్తంస శఠకోపతాపసప్రసాదాసాదితచతుర్విధకవితా
మతల్లికాల్లసానిచొక్కయామాత్యపుత్ర పెద్దనార్యప్రణీతం
బైనస్వారోచిషమనుసంభవం బను మహాప్రబంధంబునందుఁ
బ్రథమాశ్వాసము.

84

టీ. శ్రీమ...ప్రణీతంబు - శ్రీమత్ = విద్వత్తాసంపదగల, ఆంధ్రకవితాపితామహ = ఆంధ్రకవిత్వమునకు బ్రహ్మయును, సర్వతోముఖ = అంతట వ్యాప్తిగల, అంక = బిరుదు గల్గినట్టియును, పంకజాక్ష = విష్ణునియొక్క, పాదాంబుజ = పాదపద్మములకు, ఆధీన = వశమైన, మానసేందిందిర = మనస్సనెడు తుమ్మెద గలట్టియును, నందవరపురవంశోత్తంస = నందవర మనెడి యూరివారివంశమున (నందవరీకకులమున) శ్రేష్ఠుఁ డగునట్టియు, శఠకోపతాపస = శఠకోపయతియొక్క, ప్రసాద = కృపచే, ఆసాదిత = పొందఁబడిన, చతుర్విధ = నాల్గువిధములగు (బంధ, చిత్ర, గర్భ, ఆశు కవనములు), కవితామతల్లిక = శ్రేష్ఠకవిత్వముగలట్టియు, అల్లసాని చొక్కయామాత్యపుత్ర = అల్లసాని చొక్కయమంత్రికిఁ గుమారుఁ డగునట్టియు, పెద్దనార్య = పెద్దనార్యునిచే, ప్రణీతంబు = రచియింపఁబడినది. మహాప్రబంధంబునందున్ = మహాకావ్యమున, ప్రథమాశ్వాసము.