తరంగ = తరఁగలయొక్క, భంగిక = రీతిగల, యశః = కీర్తియొక్క, గాఢ = అధికమయిన, ఛవి = కాంతిచే, ఛన్న = కప్పఁబడిన, సారంగాంక = చంద్రునియొక్క, అంక = కళంకముగలవాఁడా! (గంగాతరంగములవలె స్వచ్ఛమయిన కీర్తియొక్క కాంతిచేఁ జంద్రునిలోని కళంకమును గప్పిపుచ్చినవాఁ డనుట.) నిరంకుశ...భావుకా - నిరంకుశ = నిరాఘాటకమయిన, ప్రతికళా = ప్రతివిద్యయందలి, ప్రౌఢీ = సామర్థ్యమువలన, ప్రియంభావుకా = ఇష్టుఁడగువాఁడా! గాంగే...స్పదా - గాంగేయాచల = మేరుపర్వతము, చాప = విల్లు గాఁగల = శివునియొక్క, నూపుర = అందియయగు నాదిశేషునియొక్క, వచః = వాక్కులవంటి వాక్కులయొక్క, గాంభీర్య = ప్రౌఢిమయొక్క, లీలా = విలాసమునకు, అస్పదా = స్థానమగువాఁడా! బంగా...నిలా - బంగా, ళాంగ, కళింగ(ములను దేశములయొక్క) భూప = రాజులయొక్క, సుభట = మంచిబంటులను, అభ్రశ్రేణి = మేఘపంక్తికి, ఝఝానిలా = పెద్దగాలి యగువాఁడా! (ఈ విశేషణము లన్నియుఁ గృతిపతి యగు కృష్ణరాయనికిఁ జెందుచున్నవి.) రూపకము.
గంగాజలము స్వచ్ఛతాసాంద్రముగాన కీర్తితో నుపమింపఁబడెను. ఇటులె శ్రీనాథుఁడును గొండొకచో “సాటి చదలేటినీటికి హాటకగర్భునివధూటికి... విశదయశంబుల్" అని చెప్పెను. శేషుఁడు సహస్రముఖుడుగాన నాతనివచోగాంభీర్య మసమాన మైనది. రాయ లంతటివచోగాంభీర్యము గలవాఁడనుటకు నిరంకుశప్రతికళాప్రౌఢిప్రియంభావుకత్వము సాధనము.
తా. చంద్రమండలమువఱకు వ్యాపించిన గంగయందలి యలలవలెఁ దెల్లనైనకీర్తి గలవాఁడవును, ఎల్లవిద్యలందును గల మిక్కుటమయిన పాండిత్యముచే మేలొందినవాఁడవును, ఆదిశేషుని వాగ్వైఖరివంటి వాగ్వైఖరి గలవాఁడవును, అంగకళింగబంగాళదేశముల రాజుల సేనలను గెలిచినవాఁడవునైన కృష్ణదేవరాయా!
అలం. ఉపమాతిశయోక్తినిదర్శనారూపకములు.
| క. | మండలికతపనశోభిత, కుండలిపతిశయనకర్ణకుండలితరసా | |