Jump to content

పుట:Manu Charitra.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క్షేత్రములను సేవించుటయుఁగూడ, తలఁపన్ = విచారింపఁగా, మీవంటి గృహస్థుల సుఖజీవనమునఁ గాదె = మీబోఁటియతిథిసేవాపరాయణులగు గేస్తులు సుఖముగా జీవింపఁగలుగుటచేతనే గదా!

తా. ముని యిట్లు చెప్పుచున్నాఁడు — వత్సా! మీవంటి గృహస్థులు సుఖజీవనులై యుండిననే కదా, మాబోఁటి తైర్థికులు తీర్థయాత్రలు చేయుచుండఁ గలుగుట.

సీ.

కెలఁకుల నున్నతంగెటిజున్ను గృహమేధి
          యజమానుఁ డంకస్థితార్థపేటి
పండిన పెరటికల్పకము వాస్తవ్యుండు
          దొడ్డి బెట్టిన వేల్పుగిడ్డి కాఁపు
కడ లేనియమృతంపునడబావి సంసారి
          సవిధ మేరునగంబు భవనభర్త
మరుదేశపథమధ్యమప్రప కులపతి
          యాఁకటి కొదవుసస్యము కుటుంబి


తే.

బధిరపంగ్వంధభిక్షుక బ్రహ్మచారి
జటిపరివ్రాజకాతిథిక్షపణకావ
ధూతకాపాలి కాద్యనాథులకుఁ గాన
భూసురోత్తమ గార్హస్థ్యమునకు సరియె.

66

టీ. బధిర...థులకున్ - బధిర = చెవిటివాండ్రు, పంగు - కుంటివాండ్రు, అంధ = గ్రుడ్డివాండ్రు, భిక్షుక = బిచ్చగాండ్రు, బ్రహ్మచారి = వటువులు, జటి = వానప్రస్థులు, పరివ్రాజక = సన్న్యాసులు, అతిథి = ఆగంతుకులు, క్షపణక = బౌద్ధభిక్షుకులు, అవధూత = దిగంబరులు, కాపాలిక = కాపాలికమతస్థులు, ఆది = మొదలగు, అనాధులకున్ = దిక్కు లేనివారలకు, గృహమేధి = గృహస్థుఁడు, కెలఁకులన్ = ప్రక్కలను, ఉన్న, తంగెట్టిజున్ను తంగెటి