పుట:Mana-Jeevithalu.pdf/96

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
87
మానసిక రక్షణ

లాభం పొందాలనే కోరిక - వ్యక్తిగతంగా గాని, సామూహికంగా గాని, అజ్ఞానానికీ, భ్రమకీ, వినాశానికీ, దుఃఖానికీ దారితీస్తుంది. కోరిక అనేది ఇంకా ఎక్కువ భౌతిక సుఖాలకోసమే కాదు; ధనం, జ్ఞానం, ప్రత్యేకత వల్ల వచ్చే అధికారం కోసం కూడా ఉంటుంది. ఇంకా కావాలనే తాపత్రయం సంఘర్షణకీ, దుఃఖానికీ దారితీస్తుంది. అన్ని రకాలుగానూ ఆత్మవంచన చేసుకుంటూ ఈ దుఃఖాన్ని తప్పించుకుపోవటానికి ప్రయత్నిస్తాం - అణచి వేయటం ద్వారా, దాని స్థానంలో మరొకటి ఉంచటం ద్వారా, దాన్ని పవిత్రం చేయటం ద్వారా, కాని, ఆ తాపత్రయం కొనసాగుతూనే ఉంటుంది - మరొక స్థాయిలో కావచ్చు. తాపత్రయం ఏ స్థాయిలోనైనా అది ఎప్పటికీ సంఘర్షణే, దుఃఖమే. అన్నింటిలోకీ సులభమైన పలాయన మార్గాల్లో గురువు ఒకటి. తాపత్రయం ఒకటి. కొంతమంది రాజకీయ సిద్ధాంతాల ద్వారా, దాని కార్యకలాపాల ద్వారా తప్పించుకుంటారు. కొంతమంది పూజలూ, క్రమశిక్షణ - వాటివల్ల కలిగే అనుభూతుల ద్వారా తప్పించుకుంటారు. మరి కొంతమంది గురువు ద్వారా తప్పించుకుంటారు. అలాంటప్పుడు తప్పించుకునే మార్గాలే అతి ముఖ్యమైపోతాయి. భయం, పట్టుదల ఈ మార్గాల్ని సురక్షితంగా ఉంచుతాయి. ఇక, మీరు ఉన్న స్థితి ఏమిటి అనేదానితో ప్రమేయం ఉండదు. గురువే ముఖ్యం అవుతాడు. మీ ప్రాముఖ్యం సేవకుడిగా మాత్రమే, లేక శిష్యుడిగా మాత్రమే - దాని అర్థం ఏదైనప్పటికీ. అందులో ఏదో ఒకటి అవటానికి మీరు కొన్ని పనులు చేస్తారు. కొన్ని పద్ధతుల ప్రకారం నడుచుకుంటారు. కొన్ని పాట్లు పడతారు. ఇదేకాదు. ఇంకేమైనా చెయ్యటానికైనా మీరు సంసిద్ధులే - ఈ ప్రత్యేకత సుఖాన్నీ, అధికారాన్నీ ఇస్తుంది కనుక. గురువు పేరుతో సుఖం, అధికారం గౌరవనీయమవుతాయి. మీరింక ఒంటరిగా, అయోమయంగా, ఏదో పోగొట్టుకున్నట్లుగా ఉండరు. మీరు వారికో, ఆ పార్టీకో, చెందుతారు. మీరు క్షేమంగా ఉంటారు.

ఏం చేసినా, మనలో చాలామంది కోరుకునేది అదే కాదా - క్షేమంగా ఉండటం, సురక్షితంగా ఉండటం. నలుగురితో బాటూ తప్పిపోతే అదొక రకమైన మానసిక రక్షణ. ఒక సంఘంతో గాని, ఒక భావంతో గాని - సర్వసమ్మతమైనది గాని, ఆధ్యాత్మికమైనది గాని - ఏదో ఒకదానితో ఐక్యం