పుట:Mana-Jeevithalu.pdf/95

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
86
మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

మనం చాలా చిత్రమైన మనుషులం. ఏదో కావాలని ఎక్కడెక్కడో దూరదూర ప్రదేశాల్లో వెతుకుతూ తిరుగుతాం - అది మనకి ఎంతో దగ్గరలోనే ఉన్నప్పటికీ. సౌందర్యం ఎక్కడో ఉంటుంది. ఇక్కడ కాదు; సత్యం మన ఇళ్లలో ఉండదు, ఎక్కడో దూర ప్రాంతంలో ఉంటుంది అనుకుంటాం. ప్రపంచానికి మరోవైపుకి పోతాం గురువుని అన్వేషించటానికి. నౌకరు గురించి మనం తెలుసుకోం. జీవితంలోని సామాన్య విషయాలను అర్థం చేసుకోము. ప్రతిరోజూ జరిగే పోరాటాలనూ, కలిగే సంతోషాలనూ అర్థం చేసుకోము. అయినా, ఏదో మర్మభూయిష్టమైనదాన్నీ, నిగూఢమైనదాన్నీ అందుకోవటానికి ప్రయత్నస్తాం. మనల్ని మనమే తెలుసుకోం. ఎవరో ఒక బహుమానాన్ని ఒక ఫలితాన్నీ ఒక ఆదర్శలోకాన్నీ ఇస్తానని ఆశపెడితే, వారికి సేవ చెయ్యటానికీ, వారిని అనుసరించటానికీ అంగీకరిస్తాం. మనం గందరగోళంగా ఉన్నంత కాలం మనం ఎంచుకున్నదేదైనా గందరగోళంగానే ఉంటుంది. మనం సగం అంధులమై ఉన్నప్పుడు స్పష్టంగా చూడలేము. మనం చూసేది కొంత భాగం మాత్రమే. అందుచేత అది నిజమైనది కాదు. ఇదంతా మనకి తెలుసు. అయినా, మన కోరికలూ, మన తాపత్రయాలూ ఎంత బలమైనవంటే, మనల్ని భ్రమల్లోకీ, అంతులేని దుఃఖాల్లోకీ ఈడ్చుకుపోతాయి.

గురువుల్లో ఉండే నమ్మకమే గురువుల్ని సృష్టిస్తుంది. నమ్మకం అనుభవాన్ని తీర్చిదిద్దుతుంది. ఒక ప్రత్యేక కార్యక్రమంలోనో, సిద్ధాంతంలోనో నమ్మకం ఉంటే, కోరుకున్న దాన్ని అది సృష్టిస్తుంది. కాని, దానివల్ల ఎంత నష్టం, ఎంత బాధ! సామర్థ్యం ఉన్న వ్యక్తి చేతుల్లో నమ్మకం శక్తిమంతమవుతుంది. తుపాకికన్న ప్రమాదకరమైన ఆయుధం అవుతుంది. మనలో చాలామంది వాస్తవానికన్న నమ్మకానికే ఎక్కువ విలువనిస్తారు. ఉన్న దాన్ని అర్థం చేసుకోవటానికి నమ్మకంతో పనిలేదు. అంతేకాక, నమ్మకం, ఉద్దేశం, దురభిప్రాయంగాని ఉంటే అవగాహనకి ప్రతిబంధకం. కాని మనకి నమ్మకాలూ, దృఢాభిప్రాయాలే కావాలి. అవి మనలో వేడిని పుట్టిస్తాయి. మనకి ఆశ చూపిస్తాయి. మనల్ని ప్రోత్సహిస్తాయి. మన నమ్మకాల తీరుల్ని అర్థం చేసుకున్నట్లయితే, ఎందుకు వాటిని పట్టుకుని వ్రేలాడుతున్నమో అర్థం చేసుకున్నట్లయితే, వైరుధ్యానికి ఉండే ముఖ్యకారణం ఒకటి మటుమాయ మవుతుంది.