పుట:Mana-Jeevithalu.pdf/94

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
85
మానసిక రక్షణ

మీద ఏమేమిటి రాసి ఉన్నయో అవన్నీ చదివానన్నాడు. దివ్యగురువులు ప్రపంచంలో వివిధ ప్రదేశాల్లో ఉన్నారన్న నమ్మకం తనకి కలిగిందన్నాడు. వారు తమ ప్రత్యేకమైన శిష్యులికి తప్ప ఇతరులెవ్వరికి భౌతికంగా దర్శనం ఇవ్వకపోయినా, కొందరితో వేరే మార్గాల్లో సంపర్కం పెట్టుకుంటారు. ప్రపంచ సమాలోచనకీ, కార్య నిర్వహణకీ నాయకులైన వారిని లాభదాయకంగా ప్రభావితం చేసి వారికి మార్గాన్ని సూచిస్తారు. ఆ విషయం నాయకులకు తెలియకుండా విప్లవాన్నీ, శాంతినీ తీసుకొస్తారు. ప్రతి భూఖండంలోనూ కొంతమంది దివ్యజ్ఞాన ప్రభువులు ఉన్నారనీ, ఆయా భూఖండాల భవితవ్యాన్ని రూపుదిద్దుతూ వాటికి వారి ఆశీర్వచనాలను అందజేస్తూ ఉంటారని తాను గట్టిగా నమ్ముతున్నాననీ చెప్పాడాయన. అటువంటి మహాపురుషులకు శిష్యులుగా ఉన్న చాలామందిని ఆయన ఎరుగునుట. వారికి తాము శిష్యులమని వాళ్లు చెప్పబట్టే తెలిసిందని అన్నాడాయన జాగ్రత్తపడుతున్నట్లు. ఆయన ఎంతో మనస్ఫూర్తిగానే చెబుతున్నాడు. ఆ దివ్యగురువులను గురించి మరింత తెలుసుకోవాలని కోరుతున్నాడు. ప్రత్యక్షానుభవం కలగటం, ప్రత్యక్షంగా వారితో సంపర్కం కలగటం సాధ్యమా అని అడిగాడాయన.

నది ఎంత నిశ్చలంగా ఉంది! రెండు మెరుస్తున్న చక్కని పక్షులు ఒడ్డుకి దగ్గరగా నీటిపైన పైకీ క్రిందికీ ఎగురుతున్నాయి. తేనెటీగలు కొన్ని తేనె పుట్టకోసం నీటిని పోగుచేస్తున్నాయి. చేపలవాడి పడవ ఒకటి ప్రవాహం మధ్యన ఉంది. నది ఒడ్డు పొడుగునా చెట్లు ఆకులతో ఒత్తుగా ఉన్నాయి. ఆ చెట్ల నీడలు నిండుగా నల్లగా ఉన్నాయి. పొలాల్లో కొత్తగా నాటిన వరినారు పచ్చగా కనిపిస్తున్నాయి. తెల్లటి పిట్టలు కూస్తున్నాయి. ఆ దృశ్యం ఎంతో ప్రశాంతంగా ఉంది. ఆ సమయంలో మన అల్ప సమస్యల గురించి మాట్లాడుకోవటం జాలిపడవలసిన విషయంలా తోచింది. ఆకాశం సాయంకాలపు లేత నీలిరంగులో ఉంది. గొడవ గొడవగా ఉండే పట్టణాలు ఎంతో దూరంలో ఉన్నాయి. నదికి అవతలి ఒడ్డున ఒక గ్రామం ఉంది. నది చుట్టూ ఒడ్డు వెంబడే ఒక దారి ఉంది. ఓ కుర్రవాడు స్పష్టంగా గొంతెత్తి పాడుతున్నాడు. అతని పాట అక్కడి ప్రశాంతతని భంగం చెయ్యటం లేదు.