పుట:Mana-Jeevithalu.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

80

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

బలవంతాన విధించినవి మాత్రమే. ఆవిష్కరణకి అవి మార్గాలు కాలేవు. క్రమశిక్షణ వల్ల మనస్సు తన లక్ష్యంకోసం తన్ను తాను శక్తిమంతం చేసుకోగలదు. కాని ఈ లక్ష్యం స్వీయకల్పితమైనదే. అది నిజమైనది కాదు. మనస్సు తను కోరిన విధంగానే నిజాన్ని రూపొందిస్తుంది. క్రమశిక్షణలు ఆ రూపానికి జీవశక్తిని ప్రసాదిస్తాయి.

కనుక్కోవటంలోనే, ఆత్మ అవలంబించే మార్గాలన్నిటినీ క్షణక్షణమూ కనుక్కోవటంలోనే ఆనందం ఉంటుంది. ఆత్మని ఏస్థాయిలో ఉంచినా, అది మనస్సే. మనస్సు దేని గురించి ఆలోచించగలిగినా అది మానసికమైనదే. మనస్సుకి చెందని దాన్ని గురించి మనస్సు ఆలోచించలేదు. అపరిచితమైన దాన్ని గురించి మనస్సు ఆలోచించలేదు. ఆత్మ ఏస్థాయిలో ఉన్నా, అది అపరిచితమైనదే. పైపై మనస్సు గ్రహించలేని పొరలు కొన్ని ఆత్మవి ఉన్నప్పటికీ, అవి పరిచితమైన రంగానికి చెందినవే. ఆత్మయొక్క సంచలనాలన్నీ సంబంధ బాంధవ్యాలలో క్రియారూపంలో వెల్లడి అవుతాయి. సంబంధ బాంధవ్యాలు ఒక మూసలో లేనప్పుడు ఆత్మసాక్షాత్కారానికి అవకాశం లభిస్తుంది. ఆత్మ యొక్క చర్యే సంబంధం పెట్టుకోవటం. ఈ చర్యని అర్థం చేసుకోవటానికి పక్షపాతం లేకుండా తెలుసుకోవాలి. ఎందువల్లనంటే, ఒక పక్షాన్ని ఎంచుకోవటంతో, ఒక ఆసక్తిని కాదని, మరొక దాన్ని బలపరచటమవుతుంది. ఆత్మయొక్క చర్యని అనుభవం పొందటమే తెలుసుకోవటం. ఈ అనుభవం పొందటంలో అనుభవించేది ఉండదు. అనుభవం పొందబడేది ఉండదు. ఆ విధంగా మనస్సు తాను కూడబెట్టిన వాటినన్నిటినీ వదిలి శూన్యమవుతుంది. 'నేను' అనే కూడబెట్టేది ఉండదిక. కూడబెట్టినవన్నీ గాక 'నేను' అనేదేదీ వేరుగా లేదు. ఈ నేను గమనించే దానిగా, పర్యవేక్షించేదానిగా, నిగ్రహంలో ఉంచేదానిగా తన లక్షణాలను తన నుంచి వేరు చేసుకుంటుంది - ఆత్మరక్షణ కోసమూ, అస్థిరత మధ్య తనకు స్థిరత్వాన్ని ఇచ్చుకోవటం కోసమూ. పరస్పరం లీనమయే, సమైక్యమయే అనుభవం పొందటం మనస్సుకి ద్వంద్వ స్థితినుంచి స్వేచ్ఛని కలుగజేస్తుంది. ఆ విధంగా మనస్సు యొక్క యావత్ప్రక్రియనూ - పైన జరిగేదాన్నీ, లోపల చాటుగా జరిగేదాన్ని అంతా కొంచెం కొంచెంగా ఒక్కొక్కదాని కార్యకలాపమే కాకుండా