పుట:Mana-Jeevithalu.pdf/85

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
76
మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

కోసం వెంపరలాడడంలో అదిలేదు, అనుభూతులు పరిమితమైనవి, వ్యక్తిగతమైనవి. సంఘర్షణనీ, దుఃఖాన్నీ కలిగిస్తాయి. కాని అనుభవం పొందటం అందుకు పూర్తిగా విరుద్ధమైనది. అదే అనుభవాన్ని మళ్లీ పొందటం జరగదు. అనుభవం కొనసాగదు. ఎప్పటి కప్పుడు అనుభవం పొందటంలోనే పునఃసృష్టి పరివర్తనం ఉంటాయి.

28. అధికారం

పచ్చని మైదానం మీద నీడలు నాట్యం చేస్తున్నాయి. ఎండ వేడిగా ఉన్నా, ఆకాశం బాగా నీలంగానూ మృదువుగానూ ఉంది. దడి అవతల నుంచి ఒక ఆవు పచ్చగడ్డి వైపు చూస్తోంది. అంతమంది జనం గుమిగూడటం దానికి చిత్రంగా ఉంది. పచ్చగడ్డి దానికి పరిచితమైనదే. వర్షాలు పోయి చాలా కాలమై, నేల కాలిన మట్టి రంగులో ఉంది. టేకు చెట్టు మొదలు మీద బల్లి ఒకటి ఈగల్నీ, ఇంకేవో పురుగుల్నీ పట్టుకుంటోంది. దూరాన కొండలు కనీ కనిపించకుండా ఆకర్షణీయంగా ఉన్నాయి.

ఆ చెట్లక్రింద మాట్లాడటం అయిన తరువాత, ఆవిడ చెప్పింది - గురువులకే గురువైనవాడు మాట్లాడితే వినాలని వచ్చిందిటావిడ. మొదట్లో ఎంతో మనస్ఫూర్తిగా అనుకుంది. ఇప్పుడది పట్టుదలగా మారింది. ఈ పట్టుదల చిరునవ్వులతోనూ, సహేతుకమైన సహనంతోనూ కప్పిపుచ్చబడుతోంది. ఈ సహనం ఎంతో జాగ్రత్తగా ఆలోచించి అలవరుచుకున్నది. అది మానసికమైనది కాబట్టి దాన్నీ హింసాత్మకమైన, ఆగ్రహపూరితమైన అసహనంగా రగిలించవచ్చు. ఆవిడ లావుగా ఉంది. మృదువుగా మాట్లాడుతుంది. కానీ, ఆవిడలో దృఢాభిప్రాయాల వల్లా, నమ్మకాల వల్లా పెరిగిన నిరసన భావం ఒకటి మొదలుతోంది. సౌభ్రాతృత్వానికీ, సత్కార్యాలకీ తన్ను తాను అర్పించుకుందిట. కొంచెం సేపు ఆగి, ఆవిడ ఇంకా ఇలా అంది - దివ్య గురువు మాట్లాడుతూంటే ఆవిడకు తెలుస్తుందిట. అది ఇతరులకు తెలియని నిగూఢమైన విధానం; ఆవిడకి, ఆవిడ బృందానికీ మాత్రమే తెలుసునట. చేతులూపుతూ, బుర్ర ఒకవైపుకి వంచుతూ ఆవిడ చెప్పే తీరుని బట్టి, తనకు